హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): దేవుని మాన్యాలపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. నిషేధిత భూములను కొట్టేసేందుకు కొత్త పన్నాగం పన్నారు. డిజిటల్ సర్వే చేయించి తమ కబ్జాలకు చట్టబద్ధత కల్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులపైనే ఒత్తిడి పెంచారు. ఇప్పటికే ఆలయ భూముల వివరాలు పక్కాగా లెక్క తెలిసినా, మరోసారి అవసరమైన డిజిటల్ సర్వే చేయించడానికి ఓ ప్రైవేటు సంస్థకు ఏకంగా టెండర్ కట్టబెట్టారు. రెండేండ్లుగా దేవాదాయ భూములపై అధికార పార్టీ నేతలు.. ప్రత్యేకించి నగర శివారులో బిగ్‌బ్రదర్స్ కన్నేయడంతో ఆ భూముల రక్షణ దేవాదాయ శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది.
చాలాచోట్ల రిజిస్ట్రేషన్లు కాకుండా కేవలం అగ్రిమెంట్లపైనే ఈ భూముల అమ్మకాలు జరుగుతుండగా, వాటిని చట్టబద్ధం చేయడానికి సర్వే మార్గాన్ని ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. అయితే గతంలోనే దేవాదాయ భూముల లెక్కలు పక్కాగా తేల్చి వాటిని నిషేధిత భూములుగా ప్రకటించినప్పటికీ మరోసారి ఈ సర్వే ఎందుకనే ప్రశ్నలు ఆ శాఖ అధికారులకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వమే ఈ సర్వే చేపట్టింది. స్వయంగా దేవాదాయ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే నిర్వహించి భూముల లెక్కలు తేల్చి నివేదిక ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2021లోనే దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆలయాల వారీగా నిషేధిత భూములుగా ప్రకటిస్తూ వాటి వివరాలను గెజిట్‌లో నమోదు చేసింది. ఈ భూములను ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ జిల్లాల కలెక్టర్లు గెజిట్ విడుదల చేస్తూ అన్ని జిల్లాల రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు కాపీలు పంపారు. గత రెండేండ్ల నుంచి రాష్ట్రంలో పలుచోట్ల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం కావడం, ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో కొన్ని కేసులు కబ్జాదారుల పక్షాన రావడంతో ప్రస్తుతం ఓ కంపెనీకి ఇచ్చిన డిజిటల్ సర్వే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగర శివారులోని బాలాపూర్, అత్తాపూర్, మంచిరేవుల, శామీర్‌పేట, అమీన్పూర్, బడంగ్‌పేట తదితర ప్రాంతాల్లో కొన్ని ఆలయాలకు చెందిన వందలాది కోట్ల విలువైన భూములు కబ్జాల పాలవుతున్నాయని, ఇదంతా బిగ్‌బ్రదర్స్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు స్థానికులే చెప్తున్నారు.
దేవుని ఆస్తులను అప్పనంగా కొట్టేయడానికి శివారు ప్రాంతాల్లో బిగ్‌బ్రదర్స్ ఏకంగా ఆఫీసులే తెరిచి దందా చేస్తున్నట్టు తెలుస్తున్నది. తాము కొట్టేసిన భూమికి చట్టబద్ధత రావాలంటే ప్రభుత్వం నుంచే రాజముద్ర పొందాలి. ఇందుకోసం డిజిటల్ సర్వే చేసి గూగుల్ మ్యాపులు పెట్టి పాత వాటికి రూపం లేకుండా చేసి, కొత్తగా ఉన్న భూములనే చూపి ఆలయాల ఆస్తులివే అని తేల్చడానికి పన్నాగం పన్నారు. గత ప్రభుత్వం భూములను పక్కాగా రికార్డు చేసినప్పటికీ నిషేధిత భూములుగా రిజిస్ట్రేషన్ జరుగకపోయినా కేవలం అగ్రిమెంట్లపైనే కోట్లాది రూపాయల దందా చేస్తూ కొనుగోలుదారులతో కోర్టు కేసులు, ఎండోమెంట్ రికార్డుల వ్యవహారం అన్నీ తామే చూసుకుంటామంటూ కబ్జాదారులు బహిరంగంగానే మాట్లాడుతూ వెంచర్లు చేసి మరీ అమ్ముతున్నారు.
దేవాలయ భూముల విషయంలో ట్రిబ్యునల్‌లో వేసిన కేసుల్లో కొన్ని కబ్జాదారులకు అనుకూలంగా తీర్పులు రావడం గమనార్హం. ఈ విషయంలో అప్పీల్‌కు వెళ్లకపోవడంపై ఆయా ఆలయాల అధికారులపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని తెలిసింది. కేవలం మూడు నెలల్లో సుమారు 19 కేసులు ఈ తరహాలో తీర్పు వచ్చినట్టు దేవాదాయ శాఖలోనే చర్చ జరుగుతున్నది.
ఆలయ భూములు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయి, అన్యాక్రాంతం కాకుండా ఎ లాంటి చర్యలు తీసుకుంటున్నారు, కోర్టుల్లో ఎన్ని కేసులు నడుస్తున్నాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు 2023 వరకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఎంతభూమి ఆక్రమణకు గురైంది, రిజిస్ట్రేషన్లు జరుగకున్నా కబ్జాదారులు వెంచర్లు చేసి నిర్మాణాలు చేపట్టిన వివరాలు ఏమిటనేది ఆలయాల అధికారులు చెప్పకపోవడంపై అంతర్గత సమావేశాల్లో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు సమాచారం. గెజిట్‌లో నమోదైన భూములు ఎలా కబ్జాకు గురవుతాయనే ప్రశ్నకు ఆలయాల అధికారు ల నుంచి సమాధానం లేదని దేవాదాయ శా ఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.
దేవాదాయశాఖ చేపట్టిన ఈ డిజిటల్ సర్వే వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా గెజిట్‌లో ఉన్న భూ ముల తాజా స్థితిగతులపై చర్చించిన తర్వాత వీటిని రక్షించడానికి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం సహకారం తీసుకోవాలి. కానీ ఇంకా కాలయాపన చేయడంతో మరిన్ని భూములు కబ్జాకు గురవుతాయని దేవాదాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ అలా చేయకుండా అవసరమైన వారు, వివాదాస్పదమైన భూములు ఉన్నవారు డిజిటల్ సర్వేకు వెళ్లాలంటూ చెప్పడం, గెజిట్‌లో ఉన్న భూముల వివరాలే ప్రామాణికంగా తీసుకోకపోవడంతో ఇప్పుడు కబ్జాకు గురైన వాటిని దేవాదాయ భూముల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతున్నదంటూ ఆ శాఖలోనే గుసగుసలాడుకుంటున్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్.. అసిస్టెంట్ కమిషనర్లతోపాటు ఇతర అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దేవాలయ భూములపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇందులో దేవాదాయ అధికారులు చెప్తున్న సమాధానాలకు కమిషనర్ సంతృప్తి చెందకపోగా కొందరు అసిస్టెంట్ కమిషనర్లను అప్పీల్‌కు పోకుండా ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. అం తేగాకుండా మరికొందరు కబ్జాలపై మాట్లాడినప్పుడు వారితో ఆలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన సాక్ష్యాలను తీసుకొని సమగ్ర సర్వే చేయించాలని సూచించారు. ఆలయ భూములను గుర్తించడానికి జీడీపీఎస్ (గ్లోబల్ డిఫరెన్షియల్ పొజిషన్ సర్వే) చేపట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు మాదాపూర్‌కు చెందిన అనంత్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్ ఇచ్చారు. మొత్తం మూడు కంపెనీలు ఈ టెండర్లో పాల్గొనగా, ఆ పని అనంత్ కంపెనీకి దక్కింది. వారు ఎకరం పొలం సర్వే, డిమార్కేషన్, జియో రిఫరెన్సింగ్ పనులను డిఫరెన్షియల్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారా చేయడానికి ఎకరానికి రూ.873.20 (రూ.740+జీఎస్టీ .133.20) చొప్పున ధర నిర్ణయించారు. భూముల వ్యవహారంలో దేవాదాయ అధికారుల తీరు మొదటినుంచి అనుమానాస్పదంగానే ఉండగా, చిన్న చిన్న ఆలయాలకు కోట్ల రూపాయల విలువైన భూములు కలిగి ఉండి కూడా ధూపదీపనైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదనే చర్చ జరిగింది. కమిషనర్ హరీశ్ సూచనల మేరకు ముందుగా ఏయే ఆలయాలకు సర్వే అవసరమో వారంతా అనంత్ కంపెనీతో సర్వే చేయించుకోవాలని సూచిస్తూ ఆదేశాలిచ్చా రు. అయితే గతంలో ప్రభుత్వమే సర్వే నిర్వహించగా ఇప్పుడు ప్రైవేటు కంపెనీకి సర్వే పనులు అప్పగించాల్సిన అవసరం ఏమిటంటూ ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు.
వందలాది కోట్ల ఆస్తులు ఉండి ధూపదీప నైవేద్యాలకే దిక్కు లేని పరిస్థితుల్లో నిరాదరణకు గురవుతున్న ఆలయాలను పరిరక్షించాల్సిన దేవాదాయ శాఖలో కొందరు అధికారులు అక్రమాలకు తోడ్పడుతున్నారు. ప్రత్యేకించి గతంలో నగర ప్రాంతంలో ముఖ్య అధికారులుగా పనిచేసిన వారే అధికార పార్టీ నేతలు, కబ్జాదారులతో కుమ్కక్కై డబ్బులు దండుకున్నారంటూ దేవాదాయ శాఖలోనే చెవులు కొరుక్కుంటున్నారు. వారి తర్వాత వచ్చిన అధికారులు ఈ కబ్జాల వ్యవహారం తేల్చలేక, గెజిట్‌లో ఉన్న భూములు ఎలా కబ్జాకు గురవుతాయంటూ కోర్టుల్లో వివాదాలతో తలలు పట్టుకుంటున్నారు. దేవుని మాన్యాలపై కన్నేసిన హస్తం ముఖ్యనేతల సర్వే పన్నాగంతో ఆలయ భూముల పరిరక్షణ కష్టమేనని, ఈ విషయంలో శాఖాపరంగా పునరాలోచించి నిషేధిత భూములకు రక్షణ కల్పించే చర్యలు చేపడితే బాగుంటుందని ఆ శాఖలో కీలక అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వాటిని గెజిట్‌లో నమోదుచేసింది. అన్యాక్రాంతమైన భూముల పరిరక్షణ కోసం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 5,050 ఎకకరాలను స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల వద్ద మొత్తం 92,233.23 ఎకరాల భూమి ఉండగా, అందులో సుమారు 22,554.05 ఎకరాలు కబ్జా అయ్యాయి. పూర్వ హైదరాబాద్ స్టేట్ పరిధిలోని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కూడా దేవాదాయ భూములు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్యాక్రాంతమైన ఆ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునేందుకు 2019లో దేవాదాయ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 5,050 ఎకరాలను స్వాధీనం చేసుకోగా, మరో 10,000 ఎకరాలపై వివిధ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నది. ఇందుకు సంబంధించి 2002 నుంచి 2025 వరకు దాదాపుగా 1,500 కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయని, ఇందులో దాదాపు 500 వరకు డిస్పోజ్ అయినట్టు మంత్రి కొండా సురేఖకు దేవాదాయ అధికారులు తెలిపారు.