హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖ కార్యాలయంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆ శాఖ ఉన్నతాధికారులు కన్నెర్ర జేశారు. శనివారం బొగ్గులకుంటలోని కార్యాలయంలో ఉద్యోగులతో అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. రెండురోజులుగా కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో ఎంతమంది సమయానికి వస్తున్నారని, అసలు కొంతకాలంగా వారు సరిగా పనిచేయడం లేదంటూ అధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది. జీతాలు ఆపేస్తామంటూ హెచ్చరించడంతో ఉద్యోగులు ఉన్నతాధికారులను బతిమిలాడారని, ఈ క్రమంలో ఇష్టమైతే పనిచేయండి, లేకుంటే మానేయండి అంటూ మండిపడినట్టు సమాచారం. సమయానికి రాకపోతే ఇకనుంచి ఊరుకునే ప్రసక్తే లేదని, వారి హాజరుపై ఒక అధికారి రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని సూచించినట్టు తెలిసింది.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం.. తాము పదేండ్లకుపైగా ఇక్కడే పనిచేస్తున్నామని, రెగ్యులర్ ఉద్యోగులు సరిగా పనిచేయకపోగా, వారిని అడిగే వారేలేరని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. తాము ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేస్తున్నామని, టపాలు ఇచ్చే సందర్భంలో కొంత ఆలస్యమైతే, అది కూడా కావద్దంటున్నారని, విధి నిర్వహణలోనే జరుగుతున్నదే అయినా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. తమను అకారణంగా వేధిస్తున్నారని, ఈ నెల జీతాలు ఆపేస్తున్నట్టుగా చెప్పారని, తమకు జీతాలు వస్తాయా? రావా? అనేది ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు.