హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు. సాగులో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిషర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్ హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధుల బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
కృత్రిమ మేధస్సు(ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌ను రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు అనుసంధానం చేయాలనే అంశంపై ఈ సందర్భంగా వారు చర్చించారు. డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలని సంకల్పించినట్లు, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌కు తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ హబ్‌గా మారిందని, ఇలాంటి తరుణంలో డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని నిశ్చయించినట్లు చెప్పారు.