Kaleshwaram | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి’ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడం పూర్తిగా సబబేనని ఇరిగేషన్ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ప్రతిపాదించిన చోట ఆశించిన స్థాయిలో నీటిలభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ నిర్దేశిత మార్గదర్శకాల మేరకే పీసీఎస్ఎస్ ప్రాజెక్టును మార్చినట్టు వెల్లడించారు. రీడిజైన్ ద్వారా అదనంగా ఆయకట్టు రావడంతోపాటు నీటి నిల్వసామర్థ్యం కూడా పెరిగిందని, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని ప్రభుత్వానికి నివేదించారు. మేడిగడ్డ బరాజ్‌లోని పలు పియర్లు కుంగిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం ప్రాజెక్టును సందర్శించింది. మంత్రుల బృందానికి ప్రాజెక్టు వివరాలను తెలియజేసేందుకు ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)ని రూపొందించారు. దానిని సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ మంత్రులకు వివరించారు.
ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.17,875 కోట్ల అంచనాలతో ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 2007 మే 16న జీవో 124 ద్వారా పరిపాలన అనుమతులు జారీ చేశారని మురళీధర్ గుర్తుచేశారు. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు అంచనాలను రూ.38,500 కోట్లకు పెంచుతూ 2008 డిసెంబర్ 17న జీవో 238 రూపంలో సవరించిన పరిపాలన అనుమతులు జారీచేశారని తెలిపారు. ప్రాజెక్టు విద్యుత్తు అవసరాలు 3,466 మెగావాట్లు కాగా, ఏటా 8,701 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమని అంచనా వేశారని పీపీటీలో పొందుపరిచారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 5.09 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్‌ను ప్రతిపాదించారు. దీనివల్ల మహారాష్ట్ర పరిధిలో 3,786 ఎకరాల ముంపు ఉండటంతో ఆ రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపి, బరాజ్ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని పట్టుబట్టిందని నివేదించారు. ‘148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే నీటి నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలకు తగ్గిపోతుంది. కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా నీటి లభ్యత 165.38 టీఎంసీలు మాత్రమే. అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు వాడుకోని మిగులు జలాలు. భవిష్యత్తులోఅవి వాడుకుంటే నికరంగా లభ్యమయ్యేది 102 టీఎంసీలే. అదీగాక 148 ఎఫ్ఆర్ఎల్ బరాజ్‌ను నిర్మిస్తే 102 టీఎంసీల్లోనూ 44 టీఎంసీలను మాత్రమే తరలించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో నీటి నిల్వల కోసం ప్రత్యామ్నాయాలను చూడాలని సీడబ్ల్యూసీ సూచించింది. నీటి నిల్వసామర్థ్యం కూడా 14 టీఎంసీలు మాత్రమే ఉన్నదని, దానిని పెంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపోస్ ద్వారా అధ్యయనం చేస్తే మేడిగడ్డ వద్ద 22.3 టీఎంసీల లభ్యత ఉన్నదని తేలింది. దీనివల్లే పీసీఎస్ఎస్ను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చింది. రిజర్వాయర్ల సామర్థ్యం కూడా పెంచాం’ అని వివరించారు.
కాళేశ్వరం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రూ.19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 1.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరించాలని ప్రతిపాదించగా, ఇప్పటివరకు కొత్తగా 98,570 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాల్వల ద్వారానే 456 చెరువులు నింపాం. వాటికింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ-1,2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించాం. వాటికింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉన్నది. దిగువ మానేరు కింద ఎస్సారెస్పీ స్టేజీ-1కి సంబంధించిన పాత ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ స్టేజీ-2, నిజాంసాగర్ కింద 17,08,230 ఎకరాల ఆయకుట్టను స్థిరీకరించాం. 2020-21 యాసంగి నుంచి 2023-24 వానకాలం వరకు కూడవల్లి వాగు, హల్దివాగు, 66 చెక్ డ్యామ్‌ల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాల కు కాళేశ్వరం జలాలను విడుదల చేస్తున్నాం. 2029 నాటికి ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం. అందుకు సంబంధించి టెండర్లు పూర్తికావడంతో కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి’ అని వివరించారు.
ఈ ఏడాది అక్టోబర్ 21న సాయంత్రం మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ పియర్ కుంగడంతో బరాజ్‌పై ఉన్న బ్రిడ్జి స్లాబ్ కుంగింది. దాని పకనే ఉన్న 19, 21 నంబర్ పియర్లు కూడా కుంగాయని ఈఎన్సీ తెలిపారు. ‘అక్టోబర్ 22న ఎల్అండ్టీ జీఎం సురేశ్‌కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం బరాజ్‌ను సందర్శించిందని, బరాజ్‌ని తామే పునరుద్ధరిస్తామని తెలిపింది. అదే రోజు సీడీవో, సీఈ నేతృత్వంలో టెక్నికల్ టీమ్ బరాజ్‌ను సందర్శించి కుంగుబాటుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
అక్టోబర్ 24న ఆరుగురు సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం బరాజ్‌లోని 20వ నంబర్ పియర్ 1.256 మీటర్లు కుంగినట్టు గుర్తించింది. 28వ తేదీన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ చైర్మన్ అశ్విన్ బీ పాండ్యా నేతృత్వంలోని టీమ్ బరాజ్‌ను సందర్శించింది. నవంబర్ ఒకటిన ఎన్డీఎస్ఏ టీమ్ బ్యారేజీ కుంగుబాటుపై నివేదిక ఇచ్చింది. పిల్లర్ల కుంగుబాటుకు ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్లోని లోటుపాట్లే కారణమని ఎన్డీఎస్ఏ నివేదికలో పేరొన్నది. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాతే కుంగుబాటుకు కారణాలు నిర్దారించగలమని నీటిపారుదల శాఖ సమాధానమిచ్చిం ది. ఇందుకోసం కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించాం.. అవసరమైతే బరాజ్‌లోని 7 బ్లాక్ పియర్ల తొలగింపునకు వినియోగించాల్సిన టెక్నాలజీపైనా కసరత్తు చేస్తున్నాం. వీలైనంత త్వరగా బరాజ్ పునరుద్ధరణ చేపడుతాం’ అని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం (అదనపు టీఎంసీని కలుపుకొని) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రూ.87,449.16 కోట్ల అప్పు మంజూరవ్వగా.. రూ.71,565.69 కోట్లు ప్రభుత్వం తీసుకొన్నది. ఇంకా ఆర్థిక సంస్థల నుంచి రూ.15,698.91 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. తీసుకున్న లోన్ల నుంచి ఇప్పటివరకు రూ.4,696.33 కోట్ల అసలు రీపేమెంట్ చేశారు. ఐదేండ్లలో తెచ్చిన అప్పులకు వడ్డీ రుపంలో రూ.16,201.94 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. మొత్తం రూ.21,157.87 కోట్లు తిరిగి చెల్లించారు. కాళేశ్వరం కార్పొరేషన్లో భాగమైన పాలమూరు రంగారెడ్డికి రూ.10 వేల కోట్ల లోన్ మంజూరు కాగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.7,721.51 కోట్లు విడుదలచేసింది. ఇంకా 2,278.49 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. ప్రాజెక్టు కుతీసుకున్న అప్పులకు మూడేండ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించారు. ఈ అప్పులకు సంబంధించి అసలు చెల్లింపులు ఇంకా మొదలు కాలేదు.
ప్రతిపాదించిన ఆయకట్టు 19,63,360
సృష్టించిన ఆయకట్టు 98,570
ఇంకా సృష్టించాల్సిన మిగులు ఆయకట్టు 18,64,790