హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈఎన్సీ అనిల్‌కుమార్ మరోసారి మంగళవారం హాజరయ్యారు. గ్రౌటింగ్ అంశాలపై కమిషన్‌కు వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని రెండు పిల్లర్లు కుంగడం, దానిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదిక ఇవ్వడం తెలిసిందే. ఎన్టీఎస్ఏ నివేదికపై అధ్యయనం చేయడంతోపాటు బరాజ్‌ల రక్షణకు తగిన చర్యలను తీసుకొనేందుకు ప్రభుత్వం నిపుణులతో రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటుచేసింది.
ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఓ కమిటీ బరాజ్‌ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రాజెక్టు అధికారులకు సూచించింది. 7వ బ్లాక్‌లో కుంగిన పిల్లర్ల దిగువన ఏర్పడిన బొయ్యారానికి గ్రౌటింగ్ చేయించింది. అయితే, గ్రౌటింగ్ నేపథ్యంలో పరీక్షలను నిర్వహించినా కచ్చితమైన ఫలితాలు రాబోవని, ఏమీ చేయలేమని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో గ్రౌటింగ్ అంశంపై వివరణ ఇవ్వాలని జస్టిస్ ఘోష్ కమిషన్ మరోసారి ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈఎన్సీ స్వయంగా మంగళవారం కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. వరదల నుంచి మేడిగడ్డ బరాజ్ రక్షణ కోసమే గ్రౌటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని కమిషన్‌కు అనిల్‌కుమార్ వివరించినట్టు సమాచారం.
కొత్త క్రిమినల్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయండి
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కొత్త క్రిమినల్ చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆదేశించారు. తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో శాంతిభద్రతలు, నార్కొటిక్ కంట్రోల్, సైబర్ నేరాలను అడ్డుకుంటున్న తీరు, కొత్త క్రిమినల్ చట్టాల అమలు తదితర అంశాలపై చర్చించారు.