AI Global Summit | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆశించిన విజయం సాధించలేదనడానికి సదస్సులో కనిపించిన ఖాళీ కుర్చీలే నిదర్శనం. రాష్ట్ర ప్రభు త్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా, సదస్సు కోసం రూ.9.45 కోట్ల బడ్జెట్ కేటాయించినా.. కార్యక్రమానికి స్పందన కరువైంది.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో నిర్వహించిన సదస్సు ప్రధాన హాలులో ఏర్పాటుచేసిన కుర్చీల్లో 30 శాతం ఖాళీగానే కనిపించాయి. సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సభావేదికపై ఉన్నప్పుడే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
ఐటీ రంగ ప్రముఖులు, ప్ర పంచ దిగ్గజ కంపెనీలు పాల్గొంటాయని చెప్పి నా, 4-5 ప్రముఖ కంపెనీల ప్రతినిధులే తప్ప, మిగతావాళ్లంతా స్టార్టప్ కంపెనీల ప్రతినిధులే వచ్చారు. ఇక ఐఅండ్‌పీఆర్ ప్రతినిధిగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని కొంతమంది జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం కవరేజ్‌కు ఆహ్వానించి.. మీడియా పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా అంటూ విమర్శించారు.