Harish Rao | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎంపవర్డ్ కమిటీకి సమర్పించిన నివేదిక కీలకంగా మారింది. చెట్లు నరికిన ప్రాంతాన్ని ఎంపవర్డ్ కమిటీ సందర్శించిన సందర్భంగా వారికి హరీశ్‌రావు 200 పేజీల సమగ్ర నివేదిక అందజేశారు. అందులో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సీఈసీ ప్రముఖంగా ప్రస్తావించింది. ‘వాల్టా చట్టంలోని సెక్షన్ 28(5) ప్రకారం ఒక చెట్టును నరికితే దాని స్థానంలో గాని, పరిసరాల్లో గాని కనీసం రెండు మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం సాధ్యం కాకుంటే వాటి నిర్వహణ ఖర్చును సదరు వ్యక్తులు భరించాలి. వాల్టా చట్టం అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తుంది. హెచ్‌సీయూ భూములకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. భూగర్భ జలాల పెరుగుదల, అడవుల పరిరక్షణ, వాన నీటి సంరక్షణ తదితర అంశాల్లో వాల్టా చట్టం తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నది. 400 ఎకరాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ వాల్టా చట్టానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది’ అని హరీశ్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా వాల్టా చట్టాన్ని అతిక్రమించినట్టు తేలితే లా సెక్రటరీ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఎంపవర్డ్ కమిటీ నివేదికలో ప్రస్తావించింది.
ఏండ్ల తరబడి అన్యాక్రాంతం
హెచ్‌సీయూ భూముల్లో దశాబ్దాలుగా జీవవైవిధ్యం అభివృద్ధి చెందింది. అనేక జాతుల మొక్కలు, జంతువులకు నిలయంగా మారింది. కానీ 50 ఏండ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు వివిధ సంస్థలకు వందలాది ఎకరాలను కట్టబెట్టాయి. రిజిస్ట్రేషన్ చేయకుండా నచ్చినట్టు అన్యాక్రాంతం చేశాయి. నాటి ప్రభుత్వాలు కట్టబెట్టిన సంస్థలన్నీ విద్యకు సంబంధం లేనివే. వర్సిటీ ఏర్పాటు సందర్భంగా 2300 ఎకరాల్లో విద్యా పరమైన అభివృద్ధికి మాత్రమే ఈ భూములను వినియోగించాలని నాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా భూములను ఇతర సంస్థలకు అప్పగించారు. జీవవైవిధ్యానికి కేంద్రమైన ఈ ప్రాంతం చుట్టూ ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తే.. ఉస్మాన్ సాగర్, మీర్ ఆలం ట్యాంకు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది.
మహానగరానికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే ఆ రెండు చెరువులు ఇప్పుడు కాలుష్య కాసారాలుగా మారాయి. 2004లో నాటి ప్రభుత్వం వర్సిటీ భూములను విద్యాపరమైన అభివృద్ధి కోసమే ఐఎంజీ భారత సంస్థకు అప్పగిస్తున్నట్టు ఒప్పందం కుదుర్చుకున్నది. 400 ఎకరాల్లో స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధికి వినియోగిస్తామని ఎంవోయూలో పేర్కొన్నది. ఐఎంజీ భారతపై కేసు గెలిచామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యతో సంబంధం లేని సంస్థలకు భూములను అప్పగించేందుకు సిద్ధమైంది.. ఆ భూములను టీజీఐఐసీ పూర్తిగా కాంక్రీట్ జంగల్‌గా మార్చేందుకు ప్రణాళిక రచించింది. అదే జరిగితే వందలాది జాతుల మొక్కలు, జంతువులు కనుమరుగవుతాయి. హైదరాబాద్ గ్రీన్ లంగ్స్ స్పేస్‌గా ఉన్న ప్రాంతం కాలుష్యంతో నిండిపోతుంది’ అని కేంద్ర సాధికార కమిటీకి ఇచ్చిన నివేదికలో హరీశ్ బృందం కూలంకషంగా పేర్కొన్నది.