Telangana | నల్లగొండ ప్రతినిధి, జనవరి 13 (నమస్తే తెలంగాణ): భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఏడాదికి 12,000 ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కోతలు, కొర్రీల పేరుతో పథకానికి నీరుగార్చుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులను ఉపాధి హామీ పథకంలో నమోదై, కనీసం 20 రోజులు పని చేసిన కూలీల నుంచి గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం వర్తించదు. కానీ కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో చాలా గ్రామాలు విలీనమయ్యాయి. ఇవి పేరుకు పట్టణాల పరిధిలో ఉన్నప్పటికీ అక్కడ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వీటిని పట్టణాలుగా గుర్తిస్తే కూలీలకు అన్యాయం జరుగుతుందని వ్యవసాయ, కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం కొర్రీలు మానుకోవాలని కోరుతున్నారు.
ఉపాధి కార్డు లేకున్నా చేసేది కూలి పనే
బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం, మౌలిక సదుపాయాల కల్పన, సత్వర సేవల కోసం మున్సిపాలిటీలను పెంచింది. మున్సిపాలిటీ కేంద్రాలకు పరిసర గ్రామాలను విలీనం చేసింది. ఆయా గ్రామాల్లోని ప్రజల్లో భూమి ఉన్నవారు వ్యవసాయం చేసుకుంటుంటే.. భూమి లేనివారు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామాలుగా ఉన్నప్పుడు ఉపాధి కార్డు ఉండేది. మున్సిపాలిటీల్లో కలవడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం పథకం వర్తించదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ జాబ్ కార్డుకు లింక్ పెట్టి కొర్రీలు పెడుతున్నది.
ఇంతమందికి అన్యాయమా!
ప్రభుత్వ నిబంధనతో ఎంత నష్టం జరుగుతుందో చెప్పేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఉదాహరణగా పరిశీలించవచ్చు. మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేసి పరిధిని పెంచారు. నల్లగొండ మున్సిపాలిటీలో విలీనమైన మర్రిగూడెం, చర్లపల్లి, ఆర్జాలబావి, ఖతాల్గూడెం, కేశరాజుపల్లి, శేషమ్మగూడెంలోనే 3 వేల మందికిపైగా వ్యవసాయ కూలీలు ఉన్నట్టు అంచనా. హాలియా మున్సిపాలిటీలో అనుముల, ఇబ్రహీంపట్నంలో 500 మంది పథకానికి దూరమవుతున్నాయి. చిట్యాల మున్సిపాలిటీలో విలీనమైన శివనేనిగూడెంలోనూ ఇదే పరిస్థితి. కొత్తగా ఏర్పాటైన యాదగిరిగుట్ట, మోత్కూరు, ఆలేరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, తిరుమలగిరి, హుజుర్నగర్, నేరడుచర్ల, నందికొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోనూ గ్రామాలు విలీనమయ్యాయి.విలీన గ్రామాల్లోనే 12 వేల కుటుంబాలు పథకానికి దూరమవుతున్నాయని తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఈ గ్రామాల్లో ప్రత్యేక సర్వే చేసి అర్హులను గుర్తించాలని ఆయా గ్రామాల ప్రజలు, కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పోరాటానికి సిద్ధమంటున్నారు.