హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ ఉద్యోగులు పే స్కేల్ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పంచాయతీరాజ్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు పే స్కేల్ దేవుడు ఎరుగు కనీసం మే నెల వేతనం కూడా అందలేదని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో 12వేల మంది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. 18 సంవత్సరాలుగా వీరు ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డు అందించడం, పని కల్పించడం, వారి లెక్కలు వేసి వివరాలను నమోదు చేయడం వంటి సేవలు అందిస్తున్నారు. గ్రామాలు, తండాలు, ఆవాసాలు, రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లో, గుట్టలు, ఎత్తయిన ప్రదేశాల్లో కూడా వీరు సేవలు అందిస్తున్నారు.
సాధారణ వేతనంలో పని చేస్తున్న వీరికి పే స్కేల్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందే పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సమీక్షలో ఉపాధి హామీ ఉద్యోగులకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దానికి ఇంత వరకు ముందడుగు మాత్రం పడలేదు. రాష్ట్రంలో నాన్ ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ 7600 మంది, ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (ఎఫ్టీఈ) 4500 వరకు పనిచేస్తున్నారు. వీరందరు కలిసి 12 వేల మంది వరకు ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో సంవత్సరాల కొద్ది పనిచేస్తున్నా చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. నియాకమయ్యే సమయంలో వీరం తా రోస్టర్ విధానంలో, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికయ్యారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నియామకమైనా తమను రెగ్యులరైజ్ చేయడంలేదని, కనీసం పే స్కేల్ కూడా అమలులో జాప్యం చేస్తున్నారని ఉపాధి హామీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పే స్కేల్ పెంపు అమలు చేస్తే ఒక్కో ఉద్యోగికి కనీసం 8 వేల నుంచి 15 వేల వరకు వేతనాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వేతనాల పెంపు కోసం ప్రజావాణిలోనూ ఉపాధి హామీ ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వేతనాలు ఇవ్వడానికే నానా తిప్పలు పెడుతుంది. మే నెల వేతనాలు ఇంకా విడుదల చేయలేదని, జూన్ కూడా సగం రోజులు పూర్తి అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జీతమే ఇవ్వకుంటే ఇక పే స్కేల్ ఎలా అడుగుతారనే ఉద్దేశంతోనే జీతాలను ఆలస్యం చేస్తున్నారని ఉపాధి హామీ ఉద్యోగులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.