హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకంలో పనిచేసే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్(ఎస్ఆర్డీఎస్) ఉద్యోగులు సమ్మెకు సిద్ధవుతున్నారు. పేస్కేల్ అమలు చేయకపోవడం, 4నెలల వేతనాలను కాంగ్రెస్ సర్కారు పెండింగ్‌లో పెట్టడంపై భగ్గుమంటున్నారు. ఏడాదిగా 12, 500మంది ఉపాధిహామీ సిబ్బందికి వేతనాలు 3-4 నెలలు ఆలస్యంగా వస్తున్నాయని తెలిపారు. వచ్చే కొద్దిపాటి వేతనం కూడా సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
మేడే సందర్భంగా కలెక్టర్లకు, ఇతర అధికారులకు వినతిపత్రాలు సమర్పించామని, 2,3 తేదీల్లో పెన్‌డౌన్ ద్వారా నిరసన తెలిపామని వెల్లడించారు. నేడు, రేపు మంత్రులకు వినతిపత్రాలు ఇస్తామని జేఏసీ నేతలు చెప్పారు. సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల20 తర్వాత సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు.