హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : తాము అడిగిందొకటి అయితే.. ప్రభుత్వం కొసరు వేసినట్టు మరొకటి చేసిందంటూ ఉద్యోగ సంఘాల జేఏసీ అసహనం వ్యక్తంచేస్తున్నది. హెల్త్‌కార్డులు, మే1 నుంచే నగదు రహిత వైద్యం, జూన్ 2 కల్లా మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ, ఏకమొత్తంగా పెండింగ్ బిల్లులను విడుదల, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ను పునరుద్ధరణ, కరువుభత్యం విడుదల చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగులంతా అడగుతుంటే ప్రభుత్వం మాత్రం అసలు డిమాండ్లు నెరవేర్చకుండా బదిలీలకు పచ్చజెండా ఊపడంపై వారిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బదిలీల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని, రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా చేస్తున్నదని అంటున్నాయి.
ప్రభుత్వం మొదటినుంచి ఉద్యోగులను చిన్నచూపే చూస్తున్నది. ప్రతిసారీ కమిటీలు, సమావేశాలు, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. సర్కార్ తీరుతో విసిగిపోయి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. 206 సంఘాలతో కూడిన ఒక జేఏసీ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలకు దిగితే, మరో జేఏసీ(లచ్చిరెడ్డి) అధికారులకు వినతిపత్రాలు సమర్పించింది. ముఖ్యంగా పరిపాలనా కేంద్రమైన సచివాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఈ ఉద్యమ సెగ సర్కార్‌కు గట్టిగానే తగిలింది. ఉద్యోగులు ఈ స్థాయిలో ఉద్యమిస్తారని ఊహించని ప్రభుత్వం, భవిష్యత్తులో ఇదే తీరు పోరుబాట పడితే కష్టమనేనని భావించింది. ఈ నేపథ్యంలో డైవర్షన్ డ్రామాకు తెరతీసినట్టు ఉద్యోగ సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. మే1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు బదిలీలకు అనుమతినిచ్చింది. బదిలీల షెడ్యూల్ విడుదల చేస్తే ఉద్యోగులంతా ఇదే పనిలో బిజీగా ఉంటారనే భావనతోనే సర్కార్ ఇలా చేసిందని చర్చించుకొంటున్నారు. నిరుడు ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టలేదు. కానీ ఇప్పుడు ఆగమేఘాల మీద బదిలీలకు అనుమతినివ్వడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక సోషల్ మీడియాలో పోస్టులతో సర్కార్ తీరును ఎండగడుతున్నారు. ‘డీఏ అంటే డిలే అలవెన్స్’ అని పీఆర్సీ అంటే ‘పెండింగ్ రివిజన్ కమిషన్’ అనే సెటైర్లతో పోస్టులు పెడుతున్నారు.
సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో జేఏసీలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నాయి. మే 5నుంచి రెండో దశ ఉద్యమానికి రెండు ఉద్యోగ సంఘాల జేఏసీలు పిలుపునిచ్చాయి. ఒక జేఏసీ మే 5న కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. మరో జేఏసీ(లచ్చిరెడ్డి) మే 5న సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నది. అయితే గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను చర్చిస్తారని జేఏసీ నేతలు భావిస్తున్నారు. క్యాబినెట్ భేటీ తర్వాత కూడా తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే మే 5న ఉద్యోగుల సత్తా చూపిస్తామని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.