హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, హెల్త్‌కార్డులు, కొత్త పీఆర్సీ వంటి కీలక డిమాండ్లు అటకెక్కినట్టేనా? ఈ సమస్యలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మళ్లీ మొండిచెయ్యి తప్పదా? అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవును అనే సమాధానమే వస్తున్నది. ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్స్‌లో అత్యంత కీలకమైన ఆర్థికపరమైన అంశాలను సర్కార్ అటకెక్కించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్థికేతర డిమాండ్లపైనే దృష్టిసారించినట్టు వార్తలొస్తున్నాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యోగ సంఘాల జేఏసీ మొత్తం 57 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 45 ఆర్థికేతర, స్వల్ప ఆర్థిక భారంపడేవి కాగా, 12 మాత్రమే సర్కార్‌పై పూర్తి ఆర్థికభారం పడేవి ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు, ఉద్యోగ సంఘాలకు రికగ్నిషన్, హెచ్‌వోడీల నుంచి సచివాలయంలో 12.5% కోటా, ఉద్యోగుల సాధారణ బదిలీ లు వంటి అంశాలపై సర్కారు సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆర్థికపరమైన డి మాండ్లను పక్కనపెట్టినట్టేనా..? అనే ఆందోళన ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నది. శాఖలవారీగా తీసుకుంటే రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖలకు చెందిన డిమాండ్లే అధికంగా ఉన్నాయి. ఆయా శాఖల ఉద్యోగులు సర్కార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి వచ్చిన 57 డిమాండ్ల పరిశీలనకు ఈనెల 6న ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఐఏఎస్ అధికారి నవీన్‌మిట్టల్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులు లోకేశ్‌కుమార్, కృష్ణభాస్కర్ సభ్యులుగా ఉన్నారు. ఉత్తర్వులు వెలువడిన వారం రోజుల్లో ఈ కమిటీ అన్ని సంఘాలతో చర్చలు జరిపి, సిఫారసుల రూపంలో నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రోజుల గడువు మంగళవారంతో ముగియనున్నది. సోమవారం వరకు ఈ కమిటీ తమ నివేదికను సర్కార్‌కు అందజేసినట్టు సమాచారం బయటికి రాలేదు. ఇక మిగిలింది మంగళవారమే. అయితే, గడువు ముగిసేలోగా నివేదికను అందజేయడం కష్టంగానే కనిపిస్తున్నది. ఒకవేళ అధికారుల కమిటీ నివేదికను సమర్పించినా, అది మళ్లీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి చేరాలి. ఈ ఉపసంఘం సమావేశమై, నివేదికపై చర్చించాలి. ఆ తర్వా త పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి అందజేయాలి. సీఎం ఆయా డిమాండ్లపై సానుకూలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది.
జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. తమ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కనిపించకపోవడంతో ఉద్యమ కార్యాచరణపై వెనక్కితగ్గబోమని సంఘాల నేతలు అంటున్నారు. సర్కార్‌పై సమరం కొనసాగిస్తామంటున్నారు. గతంలో తాము ప్రకటించిన కార్యాచరణ కొనసాగుతుందని ఒక నేత తెలిపారు. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆందోళనల షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు మరో నేత పేర్కొన్నారు. గ తంలో జేఏసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న అన్ని జిల్లాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన.. జూన్ 9న హైదరాబాద్‌లో లక్ష మందితో ర్యాలీ, మహాధర్నా నిర్వహించాల్సి ఉన్నది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్టు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, ఈ ఉద్యమంలో ఎలాంటి మార్పు ఉండదని, ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్లో కొంత మార్పు చేసే అవకాశం ఉన్నదని ఆయా నేతలు తెలిపారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ సం ఘాల జేఏసీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశంకానున్నది. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జేఏసీ కార్యవర్గం మధ్యా హ్నం భేటీకానున్నది. ఉద్యోగుల సమస్యలపై సర్కార్ వైఖరితోపాటు ఇప్పటికే ప్రకటించిన జేఏసీ కార్యాచరణపై ఈ సమవేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నది. ‘నన్ను కోసుకుతిన్నా రూపాయి లేదు.. ఎవరిపై మీరు సమరం జేస్తరు. ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తరు’ అన్న సీఎం వ్యాఖ్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో ఒక దఫా చర్చలు జరిపిన నేపథ్యంలో మరికొన్ని సమస్యలను సర్కార్ ముందుంచాలని నేతలు భావిస్తున్నారు. అవసరమైతే, మరోసారి అధికారుల కమిటీతో భేటీకావాలన్న ఆలోచనలో నేతలున్నారు. ఆర్థికేతర డిమాండ్లతోపాటు ఆర్థికపరమైన డిమాండ్లపై కూడా ఒత్తిడి పెంచాలని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులపై గట్టిగా పట్టుబట్టాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది.
ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్‌తో జేఏసీ నాయకులు సోమవారం భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి నివేదికను మిట్టల్‌కు అందజేశారు. ఈనెల 6న తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను అత్యవసర, ఆర్థిక, ఆర్థికేతరంగా విభజించి నివేదిక రూపంలో మిట్టల్‌కు అందజేశారు. ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, నూతన పెన్షన్ విధానం(సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్(ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యో గ నేతలు కోరారు. పొరుగు సేవల ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 317 జీవో ద్వారా మరికొన్ని రకాల బదిలీలకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ ఖజానాపై తక్షణ భారం పడని 24 అంశాలను తొలుత పరిషరించి ఆ తర్వాత మిగిలిన 14పైగా ఆర్థిక భారంతో ముడిపడిన అంశాలను దశల వారీగా పరిషరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా 44 అత్యవసర సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.