Beverages Corporation | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతుల వ్యవహారంలో బాధ్యుడిని చేస్తూ బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంపై బదిలీ వేటు వేయాలనుకున్న ప్రభుత్వం..తన నిర్ణయం నుంచి వెనుకకు తగ్గినట్టు తెలిసింది. ఎవరో చేసిన తప్పునకు జీఎంను బలిచేయడంపై రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా కలిసికట్టుగా వచ్చి ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి.. జీఎంను బదిలీ చేస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వ పెద్దల కమీషన్ తప్పును ఆయనపై నెట్టొద్దని, కార్పొరేషన్ పద్ధతి ప్రకారమే అనుమతులు ఇచ్చిందని మంత్రికి విన్నవించినట్టు తెలిసింది. ఆ కంపెనీల రాక వెనుక ఉన్న వ్యక్తులు కమీషన్ల వ్యవహారం మాట్లాడుకొని.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని అధికారులపై నెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలిసింది. బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంను తొలగిస్తే ఉద్యోగులంతా మద్యం డిపోల్లోనే ఉద్యమాలు చేయాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్‌గా అబ్రహాంపై బీఆర్ఎస్ మద్దతుదారు అనే ముద్రవేసి, ఇటీవల జరిగిన తతంగాన్నంతా ఆయనపై నెట్టాలని కొందరు ప్రభుత్వ పెద్దలు పథకం రంచించారు. ఆ ప్రభుత్వ పెద్దలు.. కార్పొరేషన్లో కమీషన్లు ఎక్కువగా ఇచ్చిన కంపెనీలకు అనుమతులు ఇప్పించారు. కథ అడ్డం తిరగడంతో జీఎం, మరో దశలో కమిషనర్‌పై కూడా బదిలీ వేటు వేయాలని ప్రయత్నించారు. వారి స్థానంలో బ్రూవరీస్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నేతల్లో ఒకరిని నియమించాలని చూశారు.
ఈ తంతంగాన్ని గమనించిన ఉద్యోగులు నేరుగా మంత్రిని కలిసి, వారి బదిలీలు నిలిపివేయించడంతోపాటు.. తమకున్న సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. బేవరేజ్ కార్పొరేషన్లో 280 మంది ఉద్యోగులు పనులు చేయాల్సిన చోటా 104 మంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. ప్రత్యక్షంగా 1800 వందల మంది హమాలీ కార్మికులు, వీరితోపాటు ఐదు వేల కుటుంబాలకు కార్పొరేషన్ పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నది. వెంటనే తమ సమస్యలకు సరైన పరిష్కారం చూపాలని ఉద్యోగులు, కార్మికులు మంత్రిని కోరినట్టు తెలిసింది.