హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్), యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్) ఏదీ వద్దు.. పాత పెన్షన్‌నే అమలుచేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించారు. కుండపోతగా పడుతున్న వర్షాన్ని లెక్కచేయకుండా తరలివచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు సీపీఎస్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలను సర్కారు పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ధర్నాలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఎస్ఎం హుస్సేని, ఎనుగుల సత్యనారాయణ, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, గంగాపురం స్థితప్రజ్ఞ, కల్వల శ్రీకాంత్, చావా రవి, వంగ రవీందర్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, జ్ఞానేశ్వర్, డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి, మారెడ్డి అంజిరెడ్డి, కటకం రమేశ్, రాజభానుచంద్రప్రకాశ్, కనకచంద్రం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పెన్షన్ హక్కులను హరిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసేందుకు కృషిచేయాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరింది. పాత పింఛన్ అమలుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తిచేసింది. సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం హైదరాబాద్‌లో స్పీకర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సీపీఎస్‌తో 20 ఏండ్లుగా సామాజిక భద్రత కరవై, ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని వాపోయారు. విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్టు స్థితప్రజ్ఞ తెలిపారు. కోశాధికారి నరేశ్‌గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, అశోక్‌రెడ్డి, సుశీల్ తదితరులు స్పీకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.