హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మరో పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశానికి రా ష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సీవీ ఆనంద్, మహేశ్‌దత్ ఎకా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తుతోపాటు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సం ఘాల నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఉద్యోగుల నూతన హెల్త్సీమ్ కు ఉద్యోగులు తమ బేసిక్ వేతనంలో 1.5% మొత్తాన్ని, సర్కార్ కూడా 1.5% కేటాయించాలన్న ప్రతిపాదనను భేటీలో అంగీకరించారు.
హెల్త్ సీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారు చేసి, ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని ముఖ్యమంతి, ఉప ముఖ్యమంత్రితో ప్రకటింపజేయాలని సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా ఈ పథకం వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో లక్షా 44 వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 12.84 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. వీరిలో నాలుగో తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, పెన్షనర్లు తమ బేసిక్-పేలో 1.5% మొత్తాన్ని చెల్లిస్తే సంవత్సరానికి రూ.528 కోట్లు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని పేర్కొన్నారు.
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ట్రస్టు సీఈవోగా నియమిస్తారు. ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్సీమ్ ఒక ముందడుగు అని సీఎస్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ఈ పథకంలో మార్పులు, చేర్పులపై ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించనున్నట్టు తెలిపారు.
సమావేశంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ సెక్రటేరియేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ దేవేందర్, పీఆర్టీయూ నేత దామోదర్‌రెడ్డి, తెలంగాణ యూ టీఎఫ్ నేత చావా రవి, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమాదేవి, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన నాగాంబ, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్య నాయక్, ప్రధాన కార్యదర్శి సాయికుమార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సం ఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ, కార్యదర్శి నర్సరాజు తదితరులు పాల్గొన్నారు.