హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)తో ఉద్యోగుల భవిష్యత్తు కార్పొరేట్లకు తాకట్టు పెట్టినట్టేనని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం(ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ స్కీమ్‌ను ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. యూపీఎస్‌కు వ్యతిరేకంగా శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ఉపవాస సత్యాగ్రహ ధర్నా నిర్వహించారు.
కార్యక్రమానికి స్థితప్రజ్ఞ సహా తెలంగాణ సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఈ పథకం యూపీఎస్ ఉద్యోగుల జీవితాలను మరింత దుర్భరం చేయనున్నదని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ మార్చి 2న తెలంగాణలో యుద్ధభేరి మోగించనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ శుభాకర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెన్షనర్ల బెనిఫిట్స్ పెండింగ్ పెట్టడంపై వారు అసంతృప్తి వ్యక్తంచేశారు. మార్చి, 2024 తర్వాత రిటైర్డ్ అయిన వారికి వెంటనే పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలని వారు కోరారు.