హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : మహాలక్ష్మి పథకానికి సంబంధించి జీరో టికెట్ డబ్బులు రూ.2,072 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి ఉందని, ఈ సొమ్మును చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీ కార్మికుల విలీనాన్ని తక్షణం చేపట్టాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన ‘పోరాట దినం’ కార్యక్రమం విజయవంతమైంది. అన్ని రీజియన్లలోని కార్మికులందరూ ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అన్ని డిపోల్లో కార్మికవర్గం అంతా ఉత్సాహంగా పాల్గొన్నారని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికులు అష్టకష్టాలు పడుతూ విజయవంతం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కార్మికులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాట దినం విజయవంతం చేసిన డిపో, యూనిట్, రీజనల్, జోనల్, రాష్ట్ర నాయకులకు, యూనియన్లకు అతీతంగా పాల్గొన్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ చేపట్టబోయే ప్రత్యక్ష పోరాటాలను కూడా కార్మికులందరూ ఇదేవిధంగా జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు.