హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : ‘పెండింగ్ డీఏల ఊసే లేదు.. పీఆర్సీపై ఆశే లేదు. సీపీఎస్ రద్దు.. పాత పింఛన్ అమలుపై నిర్దిష్టమైన హామీలు లేవు.. వారం రోజుల్లో ఇస్తామన్న హెల్త్‌కార్డులు జూన్ 1న ఇస్తామంటున్నారు.. ఇంతకు ఏం సాధించారు? కొత్తగా మీరు తెచ్చింది ఏమిటి?’ అని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రితో భేటీలో సాధించిందేమిటి? అని నిలదీస్తున్నారు. ఉద్యమాన్ని ఎందుకు వాయిదా వేశారు?, ఆర్టీసీ కార్మికుల తరహాలో ఎందుకు ఉద్యమించలేదు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు శనివారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ బెనిఫిట్లను వంద రోజుల్లో క్లియర్ చేస్తామని సర్కార్ వెల్లడించింది. గత క్యాబినెట్ సమావేశంలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక జూన్-1న హెల్త్కార్డులిస్తామన్నది. గతంలో వారంలోనే మార్గదర్శకాలిస్తాం. అమలుచేస్తామన్నారు. 2 నెలలు గడిచింది. మళ్లీ జూన్-1కి వాయిదా వేశారని ఉద్యోగులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇంత మోసం చేస్తున్న సర్కార్‌ను నమ్మేదెలా? అని మండిపడుతున్నారు.
సోషల్‌మీడియాలో రచ్చ..
సీఎంతో భేటీ అనంతరం ఉద్యోగ సం ఘాల నేతలు సీఎంతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. కొత్తగా ఏం తెచ్చారని ఉద్యోగులు, టీచర్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఎంతో భేటీ విషయంపై ఓ ఉద్యోగి, ఉద్యోగ సంఘం నేత మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. ‘ఉద్యమం అంటారు.. కొట్లాడేందుకు రెడీ కావాలంటారు.. ఆశలు రేపుతారు.. చివరికి చర్చల పేరు చెప్పి గప్‌చుప్ అవుతారు. సంఘాలను నడపడం రాకపోతే, జేఏసీ నిర్వహణ సాధ్యంకాకపోతే ఇంట్లో ఉండండి’ అని ఓ టీచర్ ఫైర్ అయ్యాడు. ‘ప్రభుత్వానికున్న 60 నెలల్లో 30 నెలలు గడిచింది. ఇక ఉద్ధరించేది ఏమున్నది’ అని మరో టీచర్ మండిపడ్డాడు.
పీఆర్సీ ఇప్పట్లో లేనట్లే..
ఉద్యోగులు ఆశగా వేచిచూస్తున్న వేతన సవరణ(పీఆర్సీ) ఇప్పట్లో లేనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ సర్కార్‌కు నివేదిక సమర్పించాలి. ఆ తర్వాత సర్కార్ ఈ నివేదికపై అధ్యయనం చేయాలి. నివేదికను బహిర్గతం చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపాలి. ఆ తర్వాతే ఫిట్‌మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంద రోజుల్లో.. అంటే ఆగస్టులోగా రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లిస్తామని సర్కార్ చెబుతున్నది. ఆ లోగా పరిషత్ ఎన్నికలు వస్తే ఆలస్యం కానున్నదని ఉద్యోగ సంఘాల నేతులు అంచనావేస్తున్నారు.
ఉద్యోగుల స్పందనలు ఇలా..
ఎంప్లాయీస్ జేఏసీ హర్షం
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చూపిన చొరవకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపింది. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. శనివారం ముఖ్యమంత్రితో సమావేశంలో పీఆర్సీ, హెల్త్‌కార్డులు, పెండింగ్ బకాయిలపై ప్రభుత్వ చిత్తశుద్ధి హర్షణీయమని తెలిపారు. సమావేశంలో పీ మధుసూదన్‌రెడ్డి, సదానందంగౌడ్, ఏ వెంకట్, కటకం రమేశ్, సంగి రమేశ్, ఎంబీ కృష్ణాయాదవ్, కే రామారావు, నోరి శ్రీనేశ్‌కుమార్, కస్తూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.