Employees JAC | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : ‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు.. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు.. పీఆర్సీ వేయలేదు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు.. మరి, ఏ సమస్య పరిష్కారమైందని మా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమరాన్ని వాయిదావేశారో మాకైతే అర్థంకావడంలేదు. సమరమన్నారు.. ఆఖరికి చల్లబడ్డారు..!’- ఇదీ రాష్ట్రంలోని సగటు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి. ఉద్యమాన్ని వాయిదా వేయడంపై, జేఏసీ తీరుపై రాష్ట్రంలోని 13. 5 లక్షల ఉద్యోగుల్లో అత్యధికులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన తరుణంలో, సమస్యలను పరిష్కరించుకోవాల్సిన తరుణంలో ఉద్యోగ జేఏసీ నేతలు పోరుబాటను వాయిదావేయడంపై సోషల్‌మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. జేఏసీ నాయకత్వంపై ఉద్యోగులతోపాటు జేఏసీ భాగస్వామ్య సంఘాల నేతలు సైతం అసంతృప్తిని వ్యక్తంచేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ‘57 డిమాండ్లల్లో కనీసం కొన్నింటినైనా పరిష్కరిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాక పోరాటాన్ని వాయిదావేస్తే బాగుండు’ అని జేఏసీలోని ఒక నేత అభిప్రాయపడ్డారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల ఉద్యోగులు రగిలిపోతున్నారు. సీఎంకు దీటుగా జేఏసీ నాయకత్వం నిలబడుతుందనుకున్నాం. కానీ, తుస్సుమనిపించారు. సీరియస్‌గా పోరాటం చేయాలన్న ఆలోచన జేఏసీ నాయకత్వానికి లేదు’ అని మరో జేఏసీ నేత వ్యాఖ్యానించారు. ‘డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తెగించి కొట్లాడాల్సి ఉండె’ననే అభిప్రాయాన్ని కొన్ని సంఘాల నేతలు వ్యక్తంచేస్తున్నారు. సర్కారుపై సమరమంటూ ప్రకటించిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మధ్యలోనే కాడెత్తేసారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల 57 పెండింగ్ డిమాండ్లపై తాడేపేడో తేల్చుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో జేఏసీ తమ కార్యాచరణను వాయిదావేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15న నల్లబ్యాడ్జీలతో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదావేసింది. జూన్ 9న నిర్వహించాల్సిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సస్పెన్స్‌లో పెట్టింది. దీంతో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సర్కారుతో రాజీపడ్డారా? అంటూ ఉద్యోగులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ‘ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్‌లో పెట్టబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నవి దశలవారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనమండలిలో ఇచ్చిన హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ ఒక్క ఏడాదిలో తొమ్మిది వేల మంది ఉద్యోగ విరమణ పొందగా, ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బినిఫిట్స్ అందలేదు. దీంతో 500 మంది హైకోర్టును ఆశ్రయించారు’ అని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అప్పుడే అన్ని సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. స్వరాష్ట్ర సాధన కోసం జేఏసీ తెగించి కొట్లాడింది. 42 రోజులపాటు సకల జనుల సమ్మెను దిగ్విజయంగా నిర్వహించింది. ఉద్యోగుల సత్తాను దేశానికే చాటిచెప్పింది. ఆ తర్వాత కూడా జేఏసీ కొనసాగింది. అయితే, ఆ తరువాత మళ్లీ ఇప్పుడే 13.5 లక్షల ఉద్యోగులు, 200కుపైగా ఉద్యోగ సంఘాలతో ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. తీరా ఉద్యమాన్ని వాయిదావేయడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యమం పేరుతో తమకు కావాల్సిన కొన్ని డిమాండ్లను కీలక సంఘాలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా కీలక ఉద్యోగ సంఘాలకు కావాల్సిన ఉద్యోగ సంఘాలకు గుర్తింపు (రికగ్నిషన్), జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు వంటి డిమాండ్లను పరిష్కరించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. వీటితో ఐదారు సంఘాలకే లాభం జరుగుతున్నదని, ఇందుకోసమేనా జేఏసీ? అంటూ పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జేఏసీలోని కొందరు నేతల తీరుపై ఉద్యోగవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘బయట గాండ్రింపులకు దిగుతూ.. సర్కారు పెద్దల దగ్గర మాత్రం నక్క వినయం ప్రదర్శిస్తున్నారు’ అనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది. బయటికి ఐదు డీఏలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూనే, ప్రభుత్వ పెద్దల ముందు మాత్రం ఒకటి, రెండు డీఏలు ఇచ్చినా చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తున్నది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అత్యంత కీలక అంశం. పీఆర్సీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు తీరని నష్టం జరుగుతున్నది. ఇంతవరకు పీఆర్సీ కమిటీ నుంచి నివేదికను సర్కారు తెప్పించుకోలేదు. ‘ముందు ఆర్థికేతర డిమాండ్లు పరిష్కరించండి’ అని కొందరు నేతలు ప్రభుత్వ వర్గాలతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే డిమాండ్లను పక్కపెట్టినట్టేనా? అనే సందేహం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. ఇదే నిజమైతే పెన్షనర్లకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆవేదన వ్యక్తమవుతున్నది. ‘డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది. అమీతుమీ తేల్చుకోవాల్సిన తరుణంలో ఇలా ఉద్యమాన్ని వాయిదావేయడంతో జేఏసీ నాయకత్వంపై నమ్మకం సడలుతున్నది’ అని జేఏసీ కో చైర్మన్ ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక డిమాండ్లను పక్కనపెట్టి, ముందు ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించండి అంటూ బహిరంగ ప్రకటన చేశారు. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారానికే అయితే జేఏసీ ఎందుకు, నాయకత్వమెందుకు?’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల జేఏసీలోనూ లుకలుకలు ఉన్నట్టు ఉద్యోగవర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కొంతమంది నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. జేఏసీ నాయకత్వ వ్యవహార శైలిపై కొన్ని సంఘాల నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 15న జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాలని మెజార్టీ సంఘాలు అభిప్రాయపడ్డాయట. అయితే, సర్కారుతో సఖ్యతతో ఉన్న కొందరు నాయకులు మాత్రం మెజార్టీ అభిప్రాయాన్ని కాదని, కేవలం నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టాలని తీర్మానం చేశారట! ఇక ఒక కీలక నేత టీవీ చానల్ చర్చలో పాల్గొనడంపై మరికొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఉద్యోగుల సమస్యలపై సీరియస్‌గా ఉద్యమం చేయాలన్న ఆలోచన జేఏసీలోని కీలక నేతలకు లేదని నాయకులు చర్చించుకుంటున్నారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల తీరుపై ఉద్యోగవర్గాలు సోషల్ మీడియా వేదిక తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. పోస్టులు పెడుతున్నారు. వాటిలో మచ్చుకు కొన్ని..