Employees JAC | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రెండు జేఏసీలున్నా.. వందలాది సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చినా.. ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించినా.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసినా.. కార్యాచరణ ప్రకటించినా డీఏ విడుదల సహా 50కిపైగా సమస్యలను పరిష్కరించడంలో రెండు జేఏసీలు విఫలం కావడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. శనివారం నాటి క్యాబినెట్లో ఒకే ఒక్క డీఏను ప్రకటించడంపై జేఏసీల పనితీరుపై, కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్ల జేఏసీ ఇటీవలే ఏకంగా ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించింది. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం సహా ప్రభుత్వ పెద్దలెవరిని కలిసినా ఉద్యోగులకు, సంఘాలకు రిక్తహస్తమే మిగిలింది. గతంలో ఒక శాతం డీఏ కోసం 56 రోజులపాటు ఉద్యోగులు సమ్మెకు దిగిన దాఖలాలున్నాయి. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికలను రేవంత్‌రెడ్డి సర్కారు ఖాతరుచేసినట్టుగా అనిపించడంలేదు.
కార్యాచరణ ప్రకటించినా లెక్కలోకి తీసుకోలేదని ప్రకటించిన ఒక్క డీఏతోనే తేలిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయులను దారుణంగా వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఏల విషయంలో మొండిచేయి చూపిందని వాపోతున్నారు. శనివారం నాటి క్యాబినెట్లో రేవంత్ సర్కారు ఒకే ఒక్క డీఏను ప్రకటించి ఉసూరుమనిపించింది. రెండు జేఏసీలున్నా.. వందలాది సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చినా కనీసం పట్టించుకున్నట్టు కనిపించలేదు. పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ హామీల మీద హామీలు గుప్పించింది. ఆ తర్వాత అదిగో డీఏ.. ఇదిగో డీఏ అంటూ దాటవేసింది. దీపావళి కానుకగా ఐదు డీఏలకు ఒకే ఒక్క డీఏపై ప్రకటన చేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుంది. డీఏల విడుదలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు సోషల్ మీడియాలో అటు ఉద్యోగ సంఘాల నేతలు, మరోవైపు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.
ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి: యూఎస్పీఎస్సీ
ఐదు వాయిదాల డీఏలు పెండింగ్‌లో ఉండగా, ఒక్క డీఏను మాత్రమే విడుదల చేయడం శోచనీయం. జీవో-317 సమస్యలపై దాటవేత వైఖరిని రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగులు నిరసిస్తున్నారు. 15 రోజుల్లో మిగతా మూడు డీఏలను విడుదల చేస్తామని, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని, సీపీఎస్‌ను రద్దుచేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒకే ఒక్క డీఏను విడుదలచేయడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చులు పెడుతూనే, దుబారా చేస్తూనే ఉంది. ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకే ఆర్థిక పరిస్థితి అడ్డమొస్తుందా..? కాలయాపన లేకుండా సమస్యలన్నింటిని పరిష్కరించాలి.
ఉద్యోగులను నిరాశపరిచిరిన ప్రభుత్వం: ఎస్టీయూ
పెండింగ్ డీఏ మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్రంగా నిరాశపరిచిందని ఎస్టీయూ టీఎస్ ఆరోపించింది. ఐదు డీఏల్లో ఒక డీఏను మాత్రమే విడుదల చేయడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ సదానందంగౌడ్ ప్రకటనలో పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌లోని అన్ని డీఏలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో కామెంట్లు