హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకులాలకు సంబంధించి విడుదలచేసిన ప్రమోషన్లు, బదిలీల ఉత్తర్వుల్లో గందరగోళం నెలకొన్నదని, తప్పులతడకగా ఉన్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రొసీజర్లను ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇస్తున్నదని గురుకుల సొసైటీ యాజమాన్యాన్ని తప్పుబడుతున్నారు. మొదట వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి త ర్వాత మాన్యువల్‌గా మార్చారని, లాంగ్ స్టాండింగ్ ఉన్నవారికి, అక్కడే ప్రమోషన్లు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లినవారికి ప్రమోషన్లను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎమ్మెస్సీ బాటనీ చేసినవారికి జేఎల్ జువాలజీలుగా పదోన్నతి కల్పించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చే సుకోవచ్చునని ఉదహరిస్తున్నారు. సమస్యను చెప్పుకునేందుకు సంస్థ కార్యదర్శిని కలవడానికి వెళ్తే కొం దరు ఉన్నతాధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. మైనార్టీ గురుకులాల్లో బదిలీ, ప్రమోషన్ ఉత్తర్వులను చూస్తే ప్రభుత్వ సంస్థా? లేక ప్రైవేట్ సంస్థా? అనే భావన కలుగుతున్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
పేర్లు లేకుండానే ఉత్తర్వులు
ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇవ్వాలంటే కచ్చితంగా ఒక ఫైల్ మూమెంట్ తర్వాత, అప్రూవలైన తర్వాత ఆ ఫైల్ నెంబరు ప్రొసీడింగ్స్ నెంబర్‌ను మెన్షన్ చేస్తూ బదిలీ లేదా ప్రమోషన్ లేదా నియామకం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఉత్తర్వు మీద దానిని జారీచేసిన అధికారి పేరు, హోదాను పేర్కొనడం సంప్రదాయం. అప్రూవల్ కాపీలో ఉండే ప్రొ సీడింగ్స్‌ను ఆధారంగా చేసుకొని ప్రతి ఉద్యోగి వివరాలు వారి సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేస్తుంటారు. కానీ, మైనార్టీ గురుకులంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో సర్టిఫికెట్ ఇచ్చిన మాదిరిగా ప్రమోషన్, బదిలీ, నూతన ని యామక ఉత్తర్వులను జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వాటిని ఏవిధంగా సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలనేది తెలియక సిబ్బంది అయోమయంలో పడిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాటికి పరిషారం చూపించాలని ఉపాధ్యాయ వర్గం డిమాండ్ చేస్తున్నది.
ప్రమోషన్స్ ఇవ్వడం, మరుసటి రోజే రివర్షన్ ఉత్తర్వులు ఇవ్వడం సొసైటీలో పరిపాటిగా మారింది. ప్రమోషన్ల ప్రక్రియ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఒక రోస్టర్ పాయింట్‌ను ఫిక్స్ చేసుకొని కొనసాగుతుంది. కానీ, మైనార్టీ గురుకులంలో ఆ పరిస్థితి లేదు. ప్రమోషన్ ఉత్తర్వులు తీసుకున్న ఉద్యోగులకు 24 గంటలు గడిచేలోగానే రివర్షన్ ఉత్తర్వులు ఇస్తున్న దుస్థితి నెలకొన్నది. ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇస్తూ కౌన్సిలింగ్ ద్వారా కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేశారు. ఆ మరుసటి రోజునే రివర్షన్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. కోరుకున్న చోటు దక్కకపోగా, ప్రమోషన్ రాకముందు పనిచేస్తున్న స్థానం కోల్పోయి, అటు ఇటు కాకుండా సుదూర ప్రాంతాల్లో పనిచేయాల్సిన దుస్థి తి నెలకొన్నది. ఇదంతా సొసైటీలోని పలువురు ఉన్నతాధికారులు కుట్రపూరితంగానే చేస్తున్నారని ఉద్యోగసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సీనియర్స్‌ను వదిలి జూనియర్స్‌కు..
ఒక ప్రాంతంలో ఎకువ కాలం పనిచేసినవారికి ప్రమోషన్స్ వస్తే కచ్చితంగా వేరే ప్రాంతానికి బదిలీ చేయాలనేది నిబంధన. మైనార్టీ గురుకులంలో ఆ నిబంధనలేవీ పాటించడం లేదు. ఒకే ప్రాంతంలో ఏడేండ్లు పూర్తయినప్పటికీ సదరు ఉద్యోగులకు అకడే ప్రమోషన్లను కల్పిస్తున్నారు. ప్రమోషన్లలో లాంగ్వేజ్ టెస్ట్ పాస్ కాలేదని కొందరికి ఆపివేయ డం విచిత్రం. పరపతి ఉన్నవారిని ఒకతీరుగా, లేనివారిని ఒక తీరుగా చూస్తూ, కొందరు ఉన్నతాధికారులు అక్రమాలకు తెరలేపారని, డబ్బులిస్తే చాలు టాప్ ర్యాంకర్స్‌ను సైతం పక్కనపెట్టి జూనియర్స్‌కు ప్రమోషన్లు ఇస్తున్నారని ఉపాధ్యాయులు మండిప డుతున్నారు. సొసైటీ తీరుతో మానసిక క్షోభ అనుభవిస్తూ దవాఖానలో చేరాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. ప్రభుత్వం సత్వరం జోక్యం చేసుకుని ప్రమోషన్లు, బదిలీలు, నూతన నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సొసైటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.