హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): వందల సార్లు వినితిపత్రాలిచ్చినా.. ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఉద్యమబాట పట్టగానే సర్కారులో కదలిక వచ్చింది. రోడ్డెక్కుతామనగానే చర్చలకు రమ్మంటూ పిలుపొచ్చింది. ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 12న చర్చలకు రమ్మం టూ జేఏసీ నేతలను సర్కారు ఆహ్వానించింది. 12న కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన 57 డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కొంత కాలంగా కోరుతున్నారు. అయితే సర్కారు నుంచి స్పందన రాకపోవడంతో మార్చి 12న నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 9న రాష్ట్రస్థాయిలో మహాధర్నాను నిర్వహించి, ఉద్యోగుల తడాఖా చూపిస్తామని జేఏసీ హెచ్చరించింది. దీంతో ఈ నెల 12న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
చేయిపట్టి లాగిన పోలీసులు భట్టి చాంబర్ వద్ద జేఏసీ నేతలకు అవమానం
సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రతాసిబ్బంది అవమానించారు. సోమవారం ఎంప్లాయిస్ జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌ను భద్రతాసిబ్బంది ఒకరు చేయిపట్టి లాగారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు భద్రతాసిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడున్నవారంతా నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు, కో చైర్మన్ వంగా రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేని, టీజీవో జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, పరమేశ్వర్‌రెడ్డి, కృష్ణాయాదవ్, జ్ఞానేశ్వర్, రామారావు, శ్రీరామ్‌రెడ్డి, రాజ్‌కుమార్, రమణ్‌రెడ్డి తదితులు భట్టి విక్రమార్కను కలిసిన వారిలో ఉన్నారు.