హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తయింది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లో ఉద్యోగుల అలాట్మెంట్లు పూర్తయినట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. జిల్లా క్యాడర్‌కు సంబంధించి 22,418 మంది టీచర్లలో శుక్రవారం సాయంత్రానికి 21,800 మంది విధుల్లో చేరారని, మిగతావారు రాత్రిలోగా చేరుతారని తెలిపారు. ఇతర శాఖలకు చెందిన 13,760 మంది విధుల్లో చేరినట్టు వెల్లడించారు. జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగుల అలాట్మెంట్లు ముగిశాయని, శనివారంతో పోస్టింగ్‌లు పూర్తవుతాయని, చాలా తక్కువ సమయంలో ఇంత భారీ ప్రక్రియను పూర్తిచేయడం రికార్డని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుతో ఇకపై స్థానికతకు పెద్దపీట వేస్తూ 95% రిజర్వేషన్లు యువతకు దక్కుతాయని తెలిపారు. ప్రస్తుతం జోన్-6లో ఉన్న 90 మంది ఇన్స్పెక్టర్లను మల్టీజోన్కు అలాట్ చేస్తూ పోలీస్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించింది.