Endowment | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణలోని అతి పెద్ద శివాలయమది. నిత్యం ఏదో ఒక అంశంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే ఈ ఆలయంలో ప్రస్తుతం ఉద్యోగుల ప్రమోషన్లు చర్చనీయాంశమయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధి జోక్యంతో తన వారికి ప్రమోషన్ ఇప్పించుకునేందుకు సీనియారిటీ లిస్టులో ఉన్న అర్హులకు అన్యాయం జరిగేలా దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగవర్గాలు చర్చించుంటున్నాయి. ఈ శివాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర డిప్యుటేషన్‌పై పీఏగా పనిచేస్తున్నారు. సదరు ఉద్యోగికి ప్రమోషన్ ఇప్పించేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రజాప్రతినిధి.. దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి రిపోర్ట్ పంపించేలా చేశారు. అయితే, తన పీఏకు మరో ఐదు నెలల వరకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో, ఆ ప్రక్రియను ఏదో రకంగా జాప్యం చేయాలని ఉన్నతాధికారులకు సూచించినట్టు తెలిసింది.
దక్షిణ తెలంగాణలోని ప్రముఖ నరసింహస్వామి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇచ్చే క్రమంలో ఆ శివాలయం నుంచి ప్రమోషన్ల లిస్టులో ఉన్నవారి పేర్లపై పదిహేను రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని ఏప్రిల్ 25న కోరారు. అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం 14 మందితో మే 16న ఫైనల్ సీనియారిటీ లిస్ట్ తయారైంది. ఈ లిస్ట్‌లో సదరు ప్రజాప్రతినిధి పీఏ కూడా ఉన్నారు. గతంలో వీరిలో ఆరుగురిపై విజిలెన్స్ విచారణ చేపట్టగా, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పనిష్మెంట్ ఇచ్చారు. అందులో ఇద్దరికి ఏడాదిపాటు ఇంక్రిమెంట్లు ఉండవని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆరుగురు డిసిప్లనరీ యాక్షన్ పీరియడ్‌లో ఉండగా, మిగతావారిలో వారివారి అర్హతలను బట్టి సీనియారిటీ లిస్ట్ ప్రకారం ప్రమోషన్లకు సంబంధించిన పేర్లను పంపాలి. కానీ అలా కాకుండా ‘ప్రొసీడింగ్స్ టు ప్రొసీడింగ్స్’ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలా? లేక ‘ఇంక్రిమెంట్ టు ఇంక్రిమెంట్’ను పరిగణనలోకి తీసుకోవాలా? అనే సందేహాన్ని వ్యక్తంచేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆలయ ఈవో గత నెల 3న లేఖ రాశారు. అందులో పేర్కొన్న ఇద్దరి పేర్లలో ఆ ప్రజాప్రతినిధి పీఏ పేరు కూడా ఉన్నది. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ప్రమోషన్ల ప్రక్రియను జాప్యం చేసేందుకే ఈవో ఈ లేఖ రాశారనే చర్చ ఉద్యోగవర్గాల్లో జరుగుతున్నది.
కాలయాపన కోసమే లెటర్లు!
ఎక్కడైనా ఇంక్రిమెంట్ తీసుకుంటేనే ఆ ఉద్యోగి తదుపరి ప్రమోషన్‌కు అర్హులవుతారని, విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత సదరు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్టు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఆ విచారణ తేదీని బట్టి ఉంటుందని దేవాదాయశాఖ ఉద్యోగులు చెప్తున్నారు. ప్రమోషన్ల విషయంలో ప్రొసీడింగ్స్‌ను అసలు పరిగణనలోకి తీసుకోవద్దని, నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్ తీసుకుంటేనే అందుకు అర్హులవుతారని దేవాదాయశాఖలో పరిపాలనా వ్యవహారాలు చూస్తున్న ఒక సీనియర్ అధికారి చెప్పారు. సీనియారిటీ లిస్ట్ రాగానే ప్రమోషన్ ఇవ్వాల్సిన చోట అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో అర్హులకు అన్యాయం చేస్తున్నారని, అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని, కేవలం ఏదో ఒక అనుమానంతో లెటర్లు రాస్తూ ప్రమోషన్లు ఇవ్వకుండా పూర్తిగా కాలయాపన చేయడమే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగుతున్నదని ఆ సీనియర్ అధికారి చెప్పారు. ప్రస్తుతం ప్రమోషన్ల కోసం పంపిన లెటర్, సీనియారిటీ లిస్ట్ దేవాదాయ శాఖ కమిషనర్ వద్ద ఉండగా, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన సొంత మనిషి కోసం శాఖా మంత్రితో ఆ అధికార పార్టీ నేత తీవ్ర ఒత్తిడి చేయించినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.