కాసిపేట, జూన్ 3 : కోతుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉద్యోగి ఆదివారం మరణించాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ పర్మినెంట్ ఉద్యోగి మేకల రాకేశ్ (46) వారం క్రితం విధులకు వెళ్లగా కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో సైడ్ రెయిలింగ్‌పై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి ఓరియంట్ హాస్పిటల్‌కు తరలించింది. అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాలలోని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం రాకేశ్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, కార్మికులు ఓరియంట్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. పలువురు నాయకులు యాజమాన్యంతో చర్చలు జరిపారు. రూ.10 లక్షల పరిహారంతోపాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు.