అమరావతి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. పీఆర్సీ సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. తాము పెట్టిన 71 డిమాండ్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో చర్చించామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని పేర్కొన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బుగ్గన వెల్లడించారు. ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దురుద్దేశంతో ఆందోళన చేపట్టలేదని, సమస్యల పరిష్కారం కోసమే ఉద్యోగులు ఉద్యమించారని తెలిపారు. ఆర్థికేతర సమస్యలు కూడా చాలా కాలం పెండింగులో ఉన్నాయని, తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని ప్రభుత్వం తెలిపిందని వెల్లడించారు.