హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ 9లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) డిమాండ్ చేసింది. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ప్రజాపాలన వేడుకల్లోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరింది. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఆరు నెలల్లో మరో డీఏ ఇస్తామన్నారు.. ఇంకెప్పుడిస్తారని, ఈహెచ్ఎస్ను ఇంకెన్ని రోజులు పెండింగ్‌లో పెడతారని ప్రశ్నించారు. పీఆర్సీ కమిటీ రిపోర్టును తెప్పించుకుని, మెరుగైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ. 700కోట్ల నుంచి రూ. 1,500కోట్లకు పెంచి, ఆరేడు నెలల్లో పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 50వేల టీచర్ల పాలిట టెట్ శాపంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
పార్లమెంట్లో యాక్ట్‌ను సవరించి టీచర్లకు ఉపశమనం కలిగించాలని కోరారు. జీవో-317 బాధితుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తామన్నది.. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని వాపోయారు. టీచర్ల ఏకీకృత సర్వీస్‌రూల్స్‌పై సమావేశం ఏర్పాటు చేయమంటే ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులంతా బాధలు దిగమింగుకుంటూ పనిచేస్తున్నారని.. ఇబ్బందులుపడుతున్నారని వాపోయారు. సమస్యలపై మాట్లాడటంలేదని, సహనంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. కనీసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. తాము కార్యాచరణను మాత్రమే వాయిదావేశామని, పోరాటాన్ని కాదని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు పుల్గం దామోదర్‌రెడ్డి, ఏ సత్యనారాయణ, ముత్యాల సత్యనారాయణగౌడ్, ఎస్ఎం హుస్సేనీ(ముజీబ్), బీ శ్యామ్, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, సదానందంగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, కటకం రమేశ్, మట్టపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.