నీలగిరి, సెప్టెంబర్ 13: వేతనాలు సక్రమంగా అందకపోగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండలోని శివాజీనగర్‌కు చెందిన సోమిరెడ్డి (45) తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు.
శుక్రవారం మధ్యా హ్నం నల్లగొండకు వెళ్లాడు. రెండు నెలలుగా జీతాలు రాకపోగా.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన చనిపోవాలని నిర్ణయించుకుని శ్రీరాంపురం-నల్లగొండ మధ్యలో జన్మభూమి రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు వాట్సాప్ ద్వారా స్నేహితులకు మెసేజ్ పంపించాడు. ‘నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. ప్రతినెలా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. పూట గడవని పరిస్థితి. ఏమి చేయాలో అర్థం కాక.. మిమ్మల్ని వీడిపోతున్నా. నన్ను క్షమించండి. నా కుటుంబానికి అండగా ఉండండి. చిరకాలం మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటా’నని మెసేజ్ చేశాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.