Fake Certificates | బెజ్జూర్, డిసెంబర్ 11: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. కళాశాలలో కలవేణి నాగరాజు 11 ఏండ్లుగా గణిత సబ్జెక్టులో ఒప్పంద అధ్యాపకుడిగా కొనసాగుతున్నాడు. కాగా.. ఇటీవల (మే-2023) ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేసే క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కమిషన్ అధికారి సర్టిఫికెట్లపై అటెస్టెడ్ చేసి పంపాలని బెజ్జూర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు ప్రిన్సిపాల్.. నాగరాజు సర్టిఫికెట్లను బోర్డుకు పంపారు.
నాగరాజు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీనివాసవనం, ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీజీ చేసినట్టు సమర్పించిన సర్టిఫికెట్‌ను బోర్డు అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత ద్రవిడ విశ్వవిద్యాలయానికి పంపించగా.. సదరు సర్టిఫికెట్ నకిలీదని అక్కడి అధికారులు తేల్చారు. దీంతో వెంటనే నాగరాజుపై చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) శంకర్‌ను ఆదేశించారు. డీఐఈవో సూచన మేరకు నాగరాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయున్నట్టు ప్రిన్సిపాల్ రాజయ్య తెలిపారు.