హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రత్యక్షంగా చూసి వెళ్లాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణు లు సోమాజిగూడ యశోద దవాఖానకు పోటెత్తారు. అభిమాన నేత కేసీఆర్‌ను చూసేందుకు అవకాశం కల్పించాలని వేడుకొన్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు పార్టీలకు అతీతంగా తరలిరావడంతో మంగళవారం రాజ్‌భవన్‌రోడ్ జనంతో పోటెత్తింది. గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభించింది.
కేసీఆర్‌ను పరామర్శించేందుకు వస్తున్న ప్రముఖులు, సందర్శకులను సమన్వయం చేసుకొనేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు మూడుసార్లు బయటకు వచ్చి ‘సార్..లోపల కోలుకుంటున్నారు.. త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు.. దయచేసి మీరంతా తిరిగి క్షేమంగా ఇండ్లకు వెళ్లండి’ అని సర్దిచెప్పారు.
ఒకదశలో మహిళలు పెద్ద సంఖ్యలో దవాఖాన ఎదుట ‘జై తెలంగాణ’.. ‘జై కేసీఆర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. జనంతాకిడి పెరుగుతున్న విషయాన్ని దవాఖాన వర్గాలు కేసీఆర్‌కు నివేదించారు. దీంతో కేసీఆర్ ‘మీ అభిమానానికి చేతులెత్తి దండంపెడుతున్న.. మీరందరూ సురక్షితంగా ఇండ్లకు తిరిగి వెళ్లండి. కోలుకున్న తర్వాత మీ మధ్యకు వస్తా’ అని వీడియో సందేశం పంపారు.
కేసీఆర్ ఆరోగ్యస్థితిగతులపై దేశనలుమూలల నుంచి పలువురు ప్రముఖులు ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కే సంగ్మా, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ కేటీఆర్‌కు ఫోన్‌చేసి కేసీఆర్ యోగక్షేమాలపై ఆరా తీశారు. గవర్నర్ తమిళిసై బుధవారం కేసీఆర్‌ను పరామర్శించనున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వేదపండితు లు ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ముంజేతి కంకణాన్ని ఆయనకు కట్టారు. కేసీఆర్ నుదట కుం కుమ తిలకాన్ని దిద్ది ఆశీర్వచనాలు అందజేశారు. ప్రముఖ క్రైస్తవ బోధకుడు కేఏ పాల్ కేసీఆర్‌ను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కేసీఆర్‌ను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దా మోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రొటెం అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పట్నం మహేందర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్, ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, సునీతా లక్ష్మారెడ్డి, లాస్య నందిత, అరికెపూడి గాంధీ, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మదన్‌రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, డాక్టర్ టీ రాజయ్య, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, గాదరి కిశోర్, జీవన్‌రెడ్డి, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, రావుల శ్రీధర్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, పీఎల్ శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్ తదితరులు కేసీఆర్‌ను పరామర్శించారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సహా పలువురు జర్నలిస్టులు కూడా కేసీఆర్‌ను పరామర్శించారు.