హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): ధాన్యం వేలంలో పాల్గొనే సంస్థలకు వరుసగా మూడేండ్లపాటు ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉండాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిబంధనలు రూపొందించింది. దీంతోపాటు కంపెనీ విలువ రూ.100 కోట్లకు తగ్గకుండా ఉండాలని స్పష్టంచేసింది. ప్రతి టన్నుకు రూ.585 చొప్పున రూ.23.40 కోట్లు ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. బిడ్డింగ్‌లో ఎంపికైన కంపెనీ మొత్తం ధాన్యం విలువలో 5% డబ్బులను ఏడు రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 30 రోజుల్లో చెల్లించి పూర్తి ధాన్యాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యం వేలానికి సంబంధించిన నిబంధనలను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు ఖరారు చేసింది. అధిక ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. ధాన్యం వేలానికి నోటిఫికేషన్ జారీ చేసిన పౌరసరఫరాల సంస్థ..
తొలి విడతలో 25 లక్షల టన్నుల ధాన్యం వేలం వేయనున్నట్టు ప్రకటించింది. 28 జిల్లాల్లోని ధాన్యం మొత్తాన్ని ఆరు లాట్స్ల్లో వేలం వేస్తారు. ఇందులో ఐదు లాట్స్‌లో నాలుగు లక్షల టన్నులు, మరో లాట్లో 5 లక్షల టన్నులు వేలం వేయనున్నది. ఆసక్తి గల వారు బిడ్డింగ్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 5 వరకు అవకాశం కల్పించింది. టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవకతవలకు తావులేకుండా నిబంధనలు రూపొందించారు. బిడ్డింగ్‌లో అక్రమాలకు పాల్పడేవిధంగా పౌరసరఫరాల సంస్థ అధికారులకు లంచం ఇవ్వజూపితే సదరు కంపెనీని వేలం ప్రక్రియ నుంచి బహిష్కరిస్తారు. అంతేకాకుండా లంచానికి ఆశపడ్డ అధికారులపై, సదరు కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. బిడ్డింగ్ అనంతరం సమస్యలు రాకుండా ఉండేందుకు బిడ్డింగ్ వేసే కంపెనీల నిబంధనలను మరింత పక్కాగా అమలుచేయాలని నిర్ణయించారు.