యాదగిరిగుట్ట, జూలై 5: రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 57 డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రభుత్వంతో యుద్ధం చేయక తప్పదని తెలంగాణ గెజిటెట్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్లతో యావత్ 13 లక్షల మందికి సంబంధించిన సమస్యల పరిష్కారం నిమిత్తం ఆఫీసర్స్ త్రిసభ్య కమిటీ, మంత్రివర్గ ఉప సంఘాలను ప్రభుత్వం నియమించిందని అన్నారు. వీరి చర్చల అనంతరం 57 డిమాండ్లను రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపినట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. క్యాబినెట్ ఆమోదం తెలిపి 15 రోజులు పూర్తయినా కేవలం ఒక డీఏ మాత్రమే అమలు చేసి మిగతావి పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు.
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ రిసార్ట్స్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కీలకమైన అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాస్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తమ తీర్మాన ప్రతులను త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్గ ఉప సంఘం, ఆఫీసర్స్ త్రిసభ్య కమిటీకి నివేదిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నదని, తనను కోసినా ఒక్క రూపాయి కూడా రాదని చెప్పి ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని విమర్శించారు. ఖజానాలో డబ్బులేవన్న ఉద్దేశంలోనే ఏడాదిన్నర వరకు వేచి చూశామని తెలిపారు. ఇక ఊరుకునేది లేదని.. సర్కార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమైనట్టు చెప్పారు.
ఉద్యోగులపై ప్రభుత్వం అణచివేత కార్యక్రమాలు చేపడుతున్నదని ఏలూరి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 206 సంఘాలతో పటిష్ఠమైన ప్రభుత్వ ఉద్యోగ జేఏసీగా ప్రభుత్వానికి త్వరలో తమ సమస్యలపై నివేదిక అందజేయనున్నట్టు వెల్లడించారు. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియంతృత్వ పోకడలు, తామే రాజులం అన్నట్టుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ట్రస్ట్‌లో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని కోరారు. అన్ని శాఖల్లో ఉద్యోగులకు వెంటనే పదోన్నతిని కల్పించాలని డిమాండ్ చేశారు. అద్దె వాహనాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.33 వేలు సరిపోక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీజీవో అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్, కోశాధికారి ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జగన్మోహన్రావు, సహదేవ్, రామకృష్ణాగౌడ్, నరహరిరావు, మల్లేశం పాల్గొన్నారు.