రాజన్న సిరిసిల్ల : నర్సు మమత మృతికి కారణమైన ప్రేమికుడు సతీష్‌ను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎల్లారెడ్డిపేట(Ellareddypet) సీఐ ఆఫీస్‌ను(Besieged by tribals) గిరిజనులు ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి న్యాయం చేయాలని నినదించారు. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని బాబాయిచెరువు తండాకు చెందిన బానోత్ రాందాస్, అంజవ్వకు నలుగురు కూతుళ్లు లలిత, సుష్మ, చిట్టి, మమత(21), కొడుకు గణేశ్ ఉన్నారు.
నాలుగో కూతురైన మమత(Mamatha) వేములవాడలోని ఓ దవాఖానలో నర్సుగా(Nurse) పనిచేస్తున్నది. గురువారం యువతి కుటుంబ సభ్యులు పండుగ కోసం బావుసింగ్నాయక్తండాకు వెళ్లారు. అయితే, ఇంట్లో మమత మాత్రమే ఉండగా, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి ఆమె మృతదేహం దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
మమత చేతికి గాయాలు ఉండడంతో ఆమెను ప్రేమించిన బావుసింగ్‌నాయక్ తండాకు చెందిన యువకుడు సతీశ్ కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు అతని ఇంటికి చేరుకొని సామగ్రిని ధ్వంసం చేశారు. ఇంట్లో పెట్రోల్ చల్లి నిప్పంటించగా దుస్తులు, పలు సామగ్రి పాక్షికంగా కాలిపోయింది. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్ఐలు రమాకాంత్, రమేశ్, శేఖర్‌రెడ్డి చేరుకొని అందోళనకారులతో మాట్లాడగా శాంతించారు. అయితే శుక్రవారం మళ్లీ బాధిత కుటుంబం సతీష్‌ను శిక్షించాలని ఆందోళన చేపట్టారు.