హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): ఎల్కతురి సభ ప్రాంగణం నుంచి హనుమకొండకు సాధారణంగా అయితే 15 నిమిషాల ప్రయాణం. కానీ, బీఆర్ఎస్ సభ ముగిసిన తర్వాత హనుమకొండకు వచ్చేందుకు సుమారు 5 గంటల సమయం పడుతుందని పోలీసులు అంచనా వేశారు. ఇక సభ నుంచి ఒక కిలోమీటరు దూరం కదలడానికి రెండు గంటల సమయం పట్టింది. ఇదీ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ అనంతరం నెలకొన్న పరిస్థితి. సభకు గులాబీదళం పోటెత్తడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జన సందోహాన్ని తలపించాయి. భారీగా వాహనాలు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు కదలడం గగనంగా మారింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సభకు రానివారే కిలోమీటర్ల ఆవల నిలిచిపోయారు. ఇక సభ నుంచి తిరిగి వెళ్లే వారు కూడా వాళ్లకు జత కావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ సక్సెస్ అయిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.