వరంగల్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ మహాసభకు తరలిరానున్న లక్షలాది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. సభ నిర్వహణ కోసం ఎల్కతుర్తిలోని 1,213 ఎకరాల్లో ఈ నెల 2న ప్రారంభమైన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ ప్రాంగణం, వేదిక సిద్ధమవుతున్నాయి. మహాసభ నిర్వహించనున్న స్థలం మొత్తం గులాబీ జెండాలతో కళకళలాడుతున్నది. ఈ స్థలం మొత్తం చదును చేయడం పూర్తయ్యింది. యాసంగిలో పత్తి పండించిన చెలకల్లో ఉన్న పత్తి పొరక, కొయ్యలను పూర్తిగా ఏరివేశారు. మహాసభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముండ్ల పొదలను తొలగించారు. నీడ నిచ్చే చెట్లకు రక్షణ ఏర్పాటుచేశారు. రజతోత్సవ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి 50 వేల వాహనాల్లో ప్రజలు తరలిరానున్నారు. ఈ వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్ వసతులు కల్పిస్తున్నారు.
సిద్దిపేట-ఎల్కతుర్తి, కరీంనగర్-ఎల్కతుర్తి, వరంగల్-ఎల్కతుర్తి జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఎంపిక చేసి చదును చేశారు. జాతీయ రహదారుల నుంచి వాహనాలు ఆయా పార్కింగ్ స్థలాల్లోకి వెళ్లేందుకు వీలుగా మొరం పోసి తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ స్థలంలో దిగిన ప్రజలు రజతోత్సవ మహాసభ ప్రాంగణం వద్దకు నడుచుకుంటూ వెళ్లేవిధంగా మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.
పార్కింగ్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో మహాసభ ప్రాంగణంలోకి చేరుకునేలా ఏర్పాటుచేస్తున్న చిన్న రోడ్ల పనులు పూర్తవుతున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే వారి కోసం సరిపడా తాగునీటిని సరఫరా చేసేందుకు పాయింట్లను ఎంపిక చేశారు. ఆయా ప్రదేశాల్లో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతారు.