శక్కర్‌నగర్, ఆగస్టు 9: కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న చర్యలు ఉద్యోగుల ప్రాణాల మీద కు వస్తున్నాయి. తమ సంస్థను కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తుందని క్షోభకు గురైన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ విద్యుత్తు సబ్‌స్టేషన్ ఆపరేటర్ బొర్ర జగన్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సబ్‌స్టేషన్‌లో బ్లేడ్‌తో గొంతు, చేయి, కాలు కోసుకొన్నాడు. గమనించిన తోటి సిబ్బంది, స్థానిక యువకులు వెంటనే అతడిని ఎడపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి బోధన్ ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు.
విషయం తెలుసుకొన్న ఆ శాఖ ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు, సిబ్బంది పలువురు దవాఖానకు చేరుకొని జగన్‌ను పరామర్శించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రాణాపాయం ఏమీలేదని ఇంటికి పంపారు. ‘విద్యుత్తు రంగాన్ని కాపాడాలని, నా మరణంతోనైనా మీలో మార్పు రావాలి’ అని కోరుతూ జగన్ ప్రధాని మోదీ పేరిట సూసైడ్ నోట్ రాశాడు. కేంద్రం విద్యుత్తు శాఖను ప్రైవేటుపరం చేస్తున్నదనే మానసిక ఆందోళన చెందిన జగన్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. విద్యుత్తు శాఖ ప్రైవేటీకరణను నిరసిస్తూ రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలతో కలత చెంది ఉంటాడన్నారు. ఉద్యోగులు ఆత్మైస్థెర్యంతో ఉండాలని ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.