మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 27: ‘మా సొంతూర్లోనే విద్యుత్తు సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కరెంట్ తీస్తుండ్రు. దీనికి అసలు సమస్య ఏంటో తెలియడం లేదు’ అని స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విద్యుత్తు అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తున్నారని, వారు తీరు మార్చుకొని విధులు నిర్వహించాలని, లేకుంటే వెంటనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రాత్రి పూట తండాల్లో కరెంట్ పోతే స్థానికంగా ఉన్న లైన్మన్, లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలు, డీఈలు తమ ఫోన్లను ఎత్తకపోవడం వల్ల ప్రజలు కరెంట్ పోయిందని స్వయంగా తనకే ఫోన్ చేసి చెప్తున్నారని ఫైర్ అయ్యారు. గ్రామాల్లో లూజ్ వైర్లను లాగి ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.