ఝరాసంగం, ఏప్రిల్ 15: గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు (Electric Poles) పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ అనేక సార్లు ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారుల్లో చలనం రావడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొన్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల కేంద్రం శివారులోని పొలాల్లో సైతం గతంలో విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండి ప్రమాదాలు సంభవించినా అధికారులు వాటిని పునరుద్ధరించలేదు. విద్యుత్ స్తంభాలు సైతం ఒక పక్కకు ఒరిగిపోయి అస్తవ్యస్తంగా మారడంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది.
కొన్ని పొలాల్లో విద్యుత్ తీగలు మరీ కిందకు వేలాడటంతో రైతులు పంట విత్తడం లేదు. కొందరు ధైర్యం చేసి విత్తినా కోత సమయంలో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో చేతికొచ్చిన పంటను పలువురు రైతులు వదులుకున్న సందర్భాలూ ఉన్నాయి. చేతికి అందే ఎత్తులోనే విద్యుత్ వైర్లు ఉండటంతో పొలాన్ని దున్నడానికి కూడా వీలు లేకుండా పోతోందని ఝరాసంగానికి చెందిన రైతు కుమ్మరి హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మండల కేంద్రంలో ఓ మేకల కాపరి వేలాడుతున్న తీగల కిందికు వెళ్లి ప్రమాదానికి గురై మృతి చెందాడు. పలువురు రైతులు సైతం విద్యుత్ షాక్కు గురైన సంఘటనలు ఉన్నాయి. ఒక పక్కకు ఒరిగిన స్తంభాలను సరిచేసి వేలాడుతున్న తీగల వద్ద అదనపు స్తంభాలు వేస్తే సమస్య పరి ష్కారమవుతుందని పలువురు రైతులు కోరుతున్నారు. ఈ విషయమై అధికారులకు విన్నవిస్తే పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తీగలు చేతికందే ఎత్తులో ఉండటం వల్ల కొందరు రైతులు కర్రలను ఊతంగా పెట్టి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే, గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ వేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇళ్ల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఫెన్సింగ్ వైర్ లేకపోవడం వల్ల పశువులు మృత్యువాత పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.