Power Cuts | మునిపల్లి, జూన్ 23: ‘ఆయ్యా మేము ఇంకా తిండి తినలేదు.. నిద్రపోలేదు.. మేము నిద్రపోయిన తర్వాత కరెంట్ తీసేసినా సరే. కానీ, తిండి తినక ముందు.. నిద్ర పోక ముందు కరెంట్ తియ్యకండి సార్.. మీ కాళ్లు మొక్కుతాం బాంచెన్’ అని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పలు గ్రామాల యువకులు విద్యుత్తు కోతలపై తమ ఫోన్లలో వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టుకున్నారు. ఈ స్టేటస్లు స్థానికంగా వైరల్‌గా మారాయి. మునిపల్లి మండలంలో విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నాణ్యమైన కరెంట్ సరఫరా జరగడం లేదు. విద్యుత్తు కోతలు ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేశారు.
కరెంట్ సమస్యలు చెప్పుకుందామని విద్యుత్తు అధికారులకు ఫోన్లు చేస్తే కాల్ లిఫ్ట్ చేయడం లేదని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఇలా వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుని ఆవేదన తెలుపుతున్నామని వారు చెప్పారు. నెల రోజుల నుంచి క్రమం తప్పకుండా రాత్రి 10 గంటలు దాటితే కరెంట్ సరిగ్గా ఉండటం లేదని, ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని మునిపల్లి మండల వాసులు పేర్కొంటున్నారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నెలక్రితం మునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో జూనియర్ లైన్మెన్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగానే షాక్‌కు గురై మృతిచెందాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కరెంటు సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని మునిపల్లి మండల ప్రజలు కోరుతున్నారు.
ఆదిలాబాద్‌లోని సంజయ్‌గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం ఇంజినీరింగ్ డిప్లొమా ప్రవేశాల కోసం మొదటి దశ కౌన్సెలింగ్‌లో పవర్ కట్ సమస్య తలెత్తింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు కౌన్సెలింగ్ కొనసాగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ పోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. తర్వాత కూడా అప్పుడప్పుడు ట్రిప్ అయ్యింది. చీకట్లోనే కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి వచ్చింది.
– ఎదులాపురం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దవాఖానలోని ప్యానల్ బోర్డులో సమస్య తలెత్తడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రాత్రి 8 గంటలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
– నిర్మల్ అర్బన్