హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది వేసవిలో విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ 19వేల మెగావాట్లు దాటొచ్చని ఇంధనశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను హెచ్చరించారు. యాసంగి ప్రారంభానికి ముందే డిమాండ్ తట్టుకునేలా విద్యుత్తు వ్యవస్థలను సన్నద్ధం చేయాలని సూచించారు. మింట్ కంపౌండ్‌లోని టీజీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సమ్మర్ యాక్షన్ప్లాన్పై శనివారం ఆయన సమీక్షించారు. డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో దక్షిణ డిస్కం పరిధిలో 72, ఉత్తర డిస్కం పరిధిలో 31 నూతన సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ట్రాన్స్‌కోకు చెందిన 181 ఈహెచ్‌టీ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు చెప్పారు. దక్షిణ డిస్కంలో 8,384, ఉత్తర డిస్కంలో 5,280 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విద్యుత్తు సంస్థల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, కృష్ణభాస్కర్, హరీశ్, వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, రెడ్కో వీసీ అండ్ఎండీ అనిల తదితరులు పాల్గొన్నారు.