హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమాలకు పాల్పడుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగర శివారుల్లో పనిచేసే సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇష్టారీతిన విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. కొందరైతే వెంచర్లకు ట్రాన్స్ఫార్మర్ లేకపోయినా కనెక్షన్లు జారీ చేస్తున్నారని, విద్యుత్తు సామగ్రిని (ఉపకరణాలు) దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కీసర, మేడ్చల్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరైతే అమాయకులైన అన్నదాతలను మోసగించి, వారి చేతే సామగ్రిని కొనుగోలు చేయిస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్ల జారీకి లంచాలు పుచ్చుకుంటున్నారు. తా జాగా యాదాద్రి-భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో ఓ రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్తు కనెక్షన్ జారీకి రూ.35వేలు లంచం పుచ్చకుంటూ అసిస్టెంట్ లైన్మెన్ ఏసీబీకి చిక్కాడు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆగడాలపై కొందరు ఇటీవలే విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే ఆయా ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతున్నది.
గ్రేటర్లో పనిచేస్తున్న విద్యుత్తు సిబ్బంది అక్రమాలపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. కొందరు అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)లు వెంచర్లలోని ప్లాట్లను తక్కువగా చూపించి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూరుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక వెంచర్లో 44 ప్లాట్లు ఉంటే 26 ప్లాట్లకు ఎస్టిమేట్లు వేసి లాభం చేకూర్చగా, ఇటీవలే ఇదే విషయంపై కొందరు విజిలెన్స్ విభాగానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కీసర సెక్షన్‌లోని కొందరు అధికారులు ఆ శాఖకు చెందిన ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు వెంచర్లలో బిగించి, డిస్కం ఆదాయానికి గండికొడుతున్నట్టు ఓ వ్యక్తి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు.
ఇదే సెక్షన్ పరిధిలో కొంతకాలం క్రితం 11 విద్యుత్తు స్తంభాలను లైన్ షిఫ్ట్ (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి) చేసినట్టు కూడా ఫిర్యాదు చేశారు. ఎస్టిమేట్లు లేకుండా గతంలో 13 స్తంభాలు మంజూరు చేయిస్తే, ఇప్పుడు మరో అధికారి 52 స్తంభాలు మంజూరు చేసినట్టు ఫిర్యాదుచేశారు. అంతేగాకుండా ఎల్టీ విద్యుత్తు సరఫరా చేసినట్టు కూడా ఫిర్యాదు చేశారు.
ఓ వెంచర్లో 44 ప్లాట్లు ఉండగా ఒక ఏఈ 26 ప్లాట్లు ఉన్నట్టు చూపించి కాంట్రాక్టర్లకు మేలు చేసే ప్రయత్నం చేశారు. పైస్థాయి అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయగా అసలు విషయం వెలుగుచూసింది. ఆ తర్వాత 44 ప్లాట్లకు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రతిపాదనలు పంపించారు. తక్కువ ప్లాట్లను చూపిన వారిపై చర్యలు తీసుకోలేదని, అక్రమార్కులను కాపాడుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటిపై విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతున్నది. ఫిర్యాదుదారుల నుంచి వివరాలను సేకరిస్తున్నది.