రేగోడ్, డిసెంబర్ 26: లంచం ఇస్తేనే మరమ్మతులు చేసి కరెంట్ సరఫరా చేస్తానని విద్యుత్తు సిబ్బంది చెప్పడంపై రైతులు భగ్గుమన్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామానికి ఐదురోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
విద్యుత్తు సిబ్బంది తీరును నిరసిస్తూ గురువారం రేగోడ్ సబ్స్టేషన్ భవనం పైకి ఎక్కి రైతులు ఆందోళనకు దిగారు. ఆర్టిజన్ కిషన్నాయక్కు ఐదు రోజులుగా విన్నవిస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. పైగా డబ్బులు ఇస్తేనే మరమ్మతు చేస్తానని చెప్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏఎస్సై మల్లయ్య వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా వారు కిందకు రాలేదు.
విద్యుత్ సరఫరా చేస్తేనే తాము దిగివస్తామని మొండికేశారు. ఏఎస్సై వెంటనే ఏఈ యాసిన్ అలీకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి కిందికి దిగివచ్చారు. అనంతరం మర్పల్లి గ్రామస్థులు వట్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ భద్రారెడ్డితో కలిసి విద్యుత్తు సమస్యపై ఏఈకి వినతిపత్రం అందజేశారు.