హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిరకాల స్వప్నమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి (పీఆర్ఎల్ఐ) కావాల్సిన విద్యుత్తు వ్యవస్థలను సిద్ధం చేశామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. దీనిలో భాగంగా నార్లాపూర్ 400/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ టెస్ట్ ఛార్జ్డ్ (ప్రయోగాత్మకంగా విద్యుత్తు సరఫరా)ను విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపారు. దీంతో ఇక్కడి పంపులను విడతలవారీగా ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. బుధవారం ఆయన ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డితో కలిసి ప్రయోగాత్మకంగా విద్యుత్తు సరఫరాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎండీ దేవుపల్లి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిరాటంకంగా నడిపేందుకు రూ.2,155 కోట్ల వ్యయంతో విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనిలో భాగంగా నార్లాపూర్, యేదుల, వట్టెం, ఉద్ధండాపూర్‌లో నాలుగు 400 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు 300 కి.మీ. పొడవున 400 కేవీ విద్యుత్‌లు లైన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. నార్లాపూర్లోని 400/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 165 ఎంవీఏ సామర్థ్యం కలిగిన 9 పవర్ ట్రాన్స్ఫార్మర్లతోపాటు 25 ఎంవీఏ సామర్థ్యంతో కూడిన 2 స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బుధవారం టెస్ట్ ఛార్జ్డ్ సందర్భంగా డిండి నుంచి యేదుల (60 కి.మీ), యేదుల నుంచి నార్లాపూర్ (30 కి.మీ) వరకు విజయవంతంగా విద్యుత్తు సరఫరా చేసినట్టు తెలిపారు.
145 మెగావాట్ల సామర్థ్యంతో మోటర్లు
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి వచ్చే నీటి పంపింగ్ కోసం నార్లాపూర్‌లో 145 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 9 మోటర్లను ఉపయోగించనున్నామని, త్వరరో వీటి డ్రైరన్ చేపట్టనున్నారని దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రామడుగులో ఏర్పాటుచేసిన 139 మెగావాట్ల బాహుబలి మోటర్ల కంటే పెద్దవని తెలిపారు. నార్లాపూర్ పంప్‌హౌజ్ వద్ద వివిధ ప్యానళ్లకు కావాల్సిన 11 కేవీ విద్యుత్తు సరఫరా వ్యవస్థను ఇప్పటికే సిద్ధం చేశామని, పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పూర్తయితే 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డైరెక్టర్లు జీ నర్సింగరావు, జే సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.