హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల రూపంలో మరో భారం పడనున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,607 కోట్ల ట్రూ అప్ చార్జీలకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి టీజీ జెన్కో పిటిషన్ సమర్పించింది. దీనిపై 2026 జనవరి 22న ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనున్నది. ఈ పిటిషన్‌పై వినియోగదారులు, విద్యుత్తు రంగ నిపుణులు తమ అభ్యంతరాలను 2026 జనవరి 10లోగా తెలియజేయవచ్చు. విద్యుత్తు కొనుగోలు అంచనాలు, వాస్తవిక కొనుగోలు వ్యయానికి మధ్య ఉన్న తేడానే ట్రూ అప్ చార్జీలు అంటారు. విద్యుత్తు సంస్థల ఖర్చును నియంత్రిస్తూ దేనికి ఎంత ఖర్చుపెట్టాలనే ఆదేశాలతో ఈఆర్సీ ఏటా టారిఫ్ ఆర్డర్ ఇస్తుంది. దీనికి లోబడే డిస్కంలు ఖర్చుచేయాలి. కానీ, విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ఉత్పత్తి ఖర్చులు, వడ్డీల విషయంలో టీజీ జెన్కో నియంత్రణ రేఖను దాటి.. అధికంగా ఖర్చుచేసింది. ప్రాథమిక అంచనాలకు మించిన వ్యయాన్ని సర్దుబాటు చేసుకోవడంలో భాగంగానే టీటీ జెన్కో ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరింది.
ఖర్చు ఎందుకు పెరిగిందంటే..
2024-25 ఆర్థిక సంవత్సరంలో టీజీ జెన్కో రూ.6,712.60 కోట్ల వ్యయం చేసేందుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ఏడాది కాలంలో టీజీ జెన్కో రూ. 8,319.73 కోట్లు ఖర్చుచేసింది. సర్దుబాటు కింద ట్రూ ఆప్‌లో భాగంగా రూ.1,607.13 కోట్లు టీజీ జెన్కో క్లెయిమ్ చేసింది. ఇదిలాఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.8,784.06 కోట్లకు అంచనాలను సవరించింది. విద్యుత్తు ప్లాంట్ల ఆపరేషన్, నిర్వహణ ఖర్చులు రూ.831 కోట్లు పెరిగాయి. దీనితోపాటు వడ్డీలు రూ.87 కోట్లు, అదనపు పెన్షనల్ లయబిలిటీ రూ.301 కోట్లు పెరిగాయి. ఏడాదిలో మొత్తంగా వ్యయం రూ. 1, 607.13 కోట్లు పెరిగింది. ఈ ట్రూ అప్ చార్జీలకు ఈర్సీ అనుమతి ఇస్తే, టీజీ జెన్కోకు రాష్ట్రంలోని డిస్కంలు కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డిస్కంలు విద్యుత్తు చార్జీల రూపంలో మళ్లీ వినియోగదారులపైనే భారం మోపుతాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో టీజీ జెన్కో వ్యయం..(రూ.కోట్లలో..)