హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) చైర్మన్ వై సతీశ్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలను కేటాయించాలని కోరుతూ.. మంత్రి కేటీఆర్‌కు సతీశ్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం సతీశ్ రెడ్డి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందన్నారు. టీఎస్ఐఐసీతోపాటు ఐటీ సెక్టార్, టీహబ్, టీ వర్క్స్ తదితర సంస్థలకు చెందిన 28 స్థలాలు వీటి ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే నేషనల్ క్లీన్ ఎనర్జీ స్కీం కింద తాము ఈ స్థలాల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే హైదరాబాద్‌లో 292ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ముఖ్యంగా ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ ప్లేస్‌లు, బస్ డిపోలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాలు, పెట్రోల్ బంకులు తదితర పబ్లిక్ ప్లేస్‌లలో వీటి ఏర్పాటునకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా 1301ప్రాంతాలను రెడ్కో గుర్తించిందని, ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారానికి సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో ఫార్ములా రేసింగ్ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, మంత్రి కేటీఆర్ చొరవతోనే వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా రేసింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.