స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మళ్లీ కొత్త నాటకం మొదలైంది. పార్టీ సింబల్ ఉండని గ్రామ పంచాయతీ ఎన్నికలను పార్టీపరమైన రిజర్వేషన్లతోనే నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. వచ్చే ఏడాది మార్చిలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే, పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు దాదాపు రూ.మూడు వేల కోట్లు వెనక్కిపోతాయనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది.
హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సోమవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వపరమైన రిజర్వేషన్లు కల్పించడమా? లేక కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లి, బీసీలకు 42% రిజర్వేషన్లను (BC Reservations) పార్టీపరంగా ఇవ్వడమా? అనే అంశం మీదనే ప్రధానంగా చర్చించి, అంతిమంగా మరోసారి బీసీలను మోసం చేయడానికే మంత్రివర్గం వ్యూహరచన చేసినట్టు తెలిసింది. డిసెంబర్ మొదటి వారంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలన వారోత్సవాలను నిర్వహించాలని, తదనంతరం పార్టీపరమైన రిజర్వేషన్లతో ముందుగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, ఇదే ఊపు మీద సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో-9ను సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నదంటూ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా.. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో 50% రిజర్వేషన్ల పరిమితికి మించకుండా పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పార్టీపరమైన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రతిపాదనకు ఢిల్లీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, బీసీ సంఘాల నేతల నుంచి ప్రతిఘటన ఎదురైంది. తమకు పార్టీపరమైన రిజర్వేషన్లు అవసరం లేదని, ప్రభుత్వపరమైన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల నేతలు పట్టుపడుతున్నారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన దీక్షలో అన్ని పార్టీల నేతలు పాల్గొని పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే సర్కారుపై యుద్ధం తప్పదని హెచ్చరించారు. దీంతో వ్యూహాత్మకంగా వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిసింది.
ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు
ముందుగా గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని, బీసీ బిల్లులను పార్లమెంటులో ఆమోదించిన తరువాతే 42% ప్రభుత్వపరమైన రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తామనే విషయాన్ని స్పష్టంగా బీసీ సంఘాల నేతలకు, రాష్ట్ర ప్రజలకు వివరించాలని క్యాబినెట్లో చర్చ జరిగినట్టు తెలిసింది. సర్పంచ్ ఎన్నికలకైనా బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, బంద్‌లు, రాస్తారోకోలు, ఆందోళనలకు దిగే అవకాశం ఉన్నదని, తద్వారా విజయోత్సవాలకు అడ్డంకిగా మారుతాయని మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ముందుగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న బీసీ సంఘాల నేతలతో మాట్లాడి, వారిని వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనకుండా చూడాలని, బీసీ మంత్రులు ఈ బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన రెండు బీసీ బిల్లులు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే బీసీ గణనకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ బిల్లులను ఆమోదించే ప్రసక్తి లేదు కానీ, తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు బీసీ సంఘాల నేతలను ఒప్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకోసం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రస్థాయిలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేసినట్టు తెలిసింది. బీసీల రిజర్వేషన్ కోసం పార్లమెంటు సమావేశాల సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లడం, రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేయడం, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ అడగడం తదితర కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా పార్లమెంటు మీద ఒత్తిడి తెస్తున్నామనే సంకేతాలు ప్రజలకు, బీసీ సంఘాల నేతలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతిమంగా సర్పంచ్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బేరీజు వేసుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.