హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): అసలే దసరా పండుగ… ఆపై స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్… దీనికి తోడు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై అయోమయం.. వెరసి ఆశావహుల గుండెల్లో దడ పుడుతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ల (Local Reservation) ప్రకారం తమ గ్రామ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు తమ వర్గానికి (బీసీలకు) ఖరారయ్యాయనే సంతోషం వారిలో కనిపించడం లేదు. బీసీలే కాదు.. ఇతర వర్గాల పరిస్థితీ ఇలాగే ఉన్నది. రిజర్వేషన్ ఖరారైందని ముందూ వెనక చూసుకోకుండా ఇప్పుడు ఖర్చు చేస్తే, ఒకవేళ రిజర్వేషన్లను కోర్టు కొట్టేస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వారిలో నెలకొన్నది. ఒకవైపు కోర్టు కేసు, మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌తో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దసరా కోసం, ఎన్నికల కోసం ఖర్చు చేసేందుకు ఆశావహులు జంకుతున్నారు. రిజర్వేషన్లు కిందామీదైతే ఆర్థికంగా భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
రిజర్వేషన్లపై అయోమయం…!హైకోర్టు కొట్టేస్తే…?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. అయితే ఇవి అమలవుతాయా? లేదా? అనే దానిపై అయోమయం నెలకొన్నది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. దీనికితోడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వడంతో రిజర్వేషన్లు 69 శాతానికి చేరాయి. దీంతో ఇది రాజ్యాంగ విరుద్ధమని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు సీఎం సోదరులతో సన్నిహితంగా ఉంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే ఇప్పటికే ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసును ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఇలా కేసు కోర్టులో ఉండగానే ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ 42% రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేస్తే, పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఇదే జరిగితే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లు మారుతాయి. ప్రస్తుతం బీసీలకు కేటాయించిన స్థానాల్లో మార్పులొస్తాయి. దీంతోపాటు ఓపెన్ కోటా, ఎస్సీ స్థానాల్లోనూ మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల అమలుపై అయోమయం నెలకొన్నది.
ఆశావహులకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి మాదిరిగా తయారైంది. కొంతమంది ఎప్పటినుంచో గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటున్నారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ప్రచారానికి మరింత పదునుపెట్టారు. అసలే బరిలో ఉన్నారు.. ఆపై పండుగొచ్చింది.. దీంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు అనుచరులు, యువత, ఇతర నేతలు సైతం ఆశావహుల నుంచి ఆశిస్తున్నారు. అయితే, కొత్త రిజర్వేషన్లను నమ్ముకొని ఖర్చు చేసేందుకు ఆశావహులు జంకుతున్నారు. ఈ రిజర్వేషన్లు ఇలాగే కొనసాగితే పర్వాలేదు కానీ, ఒకవేళ తలకిందులైతే పరిస్థితేమిటని వారు ఆందోళన చెందుతున్నారు.
భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన తర్వాత రిజర్వేషన్లు మారితే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఆ భయంతో ఇప్పుడు పండుగలకు ఖర్చు చేయకుండా, ఎవర్నీ దగ్గరకు తీయకుండా ఉంటే ఒకవేళ రిజర్వేషన్లు కొనసాగితే ఆ తర్వాత ఎవరూ తనను దగ్గరకు రానివ్వరనే ఆందోళన కూడా వారిలో నెలకొన్నది. ఈవిధంగా వారి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లపై ఎటూ తేలకుండానే, కోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే రిజర్వేషన్లు ఖరారు చేసి, షెడ్యూల్ ఇవ్వడమేమిటని చర్చించుకుంటున్నారు.