హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలోనే మోగనున్నది. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ రానున్నది. సోమవారం మంత్రుల సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీలపై మరింత స్పష్టత రానున్నది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తున్నది. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు 15 రోజులు మాత్రమే గడువు ఉన్నందున గ్రామాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి’ అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మూడు రోజుల క్రితం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత తాను అలా చెప్పలేదంటూ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.
పార్టీ అంతర్గత సమావేశాల్లో రాష్ట్ర మంత్రులు చెప్తున్న దాన్ని బట్టి జూలై చివరినాటికి ఎన్నికలు ముగించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ప్రభుత్వవర్గాలు చాలాసార్లు లీకులు ఇచ్చాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి 17 నెలలు అవుతున్నది. మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు తీరి కూడా ఏడాది దాటింది. వీటికి నిధులు రాకపోవడంతో సమస్యల్లో కునారిల్లుతున్నాయి. ప్రత్యేక అధికారులకు సమస్యలపై ప్రజల నుంచి ఒత్తిడులు తీవ్రమయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం బాధితుల తాకిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సైతం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రికి పలు సందర్భాల్లో విన్నవించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, రాజీవ్ యువ వికాసం పథకాలు ప్రజావ్యతిరేకతను కొంత మేరకు తగ్గిస్తాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
రైతులను ప్రసన్నం చేసుకొని ఎన్నికలకు..
వారం రోజుల్లో వానకాలం రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి, రాజీవ్ యువ వికాస పథకాన్ని కొలిక్కి తీసుకొచ్చి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. సోమవారం జరిగే క్యాబినెట్ భేటీలో రైతుభరోసాకు నిధుల సమీకరణ, చెల్లింపులు, ఆరు గ్యారెంటీల అమలు తదితర అంశాల మీద చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 1.52 కోట్ల ఎకరాల సాగు భూమి సాగులో ఉన్నదని, ఎన్నికల సమయం కాబట్టి ప్రస్తుతానికి మొత్తం భూమికి రైతుభరోసా ఇవ్వాలని ప్రబుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకోసం రూ.9,200 కోట్లు అవసరమని నిర్ధారించినట్టు సమాచారం. ఈనిధులు ఎలా సమీకరించాలని అనే అంశం మీదనే క్యాబినెట్లో ప్రధాన చర్చ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రిజర్వుబ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, మరో రూ.4వేల కోట్ల అప్పు కోసం ఇండెంట్ పెట్టింది. మిగిలిన డబ్బును ఎలా సమాకూర్చాలనే అంశం మీద మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 12,777
రాష్ట్రంలోని 12,848 గ్రామ పంచాయతీలకు 2019లో ఎన్నికలు జరిగాయి. వాటిలో 71 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో విలీనమైనందున మిగిలిన 12,777 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశంపై ఒక కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ వ్యవహారం ఇంకా ఎటూతేలలేదు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఒత్తిడి వస్తే బీసీలకు 42% స్థానాల్లో చోటుకల్పిద్దామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. గతంలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలైనందున ఈసారి కూడా వారికి సగం సీట్లు దకనున్నాయి. గతంలో 2.02 కోట్ల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలుచేశారు. ఇప్పుడు కొన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమైనందున గ్రామీణ జనాభా 1.9 కోట్లకు చేరింది. ఈసారి బీసీలకు 20-22%, ఎస్సీలకు 18-20%, ఎస్టీలకు 8-10%, సీట్లు కేటాయించే అవకాశం ఉన్నది. రొటేషన్ అమలుకు చట్టం చేసినందున గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన స్థానాలు ఇప్పుడు మారే అవకాశం ఉన్నది.
వార్డుల బ్యాలెట్ పేపర్లు సిద్ధం
ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉంచామని, ఎన్నికల విధివిధానాల పుస్తకాలనూ ముద్రించినట్టు చెప్తున్నా రు. ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తేల్చి, ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించమంటే అప్పుడు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల అధికారులు స్పష్టంచేస్తున్నారు.42% ఇవ్వకుంటే బీసీలను మోసగించడమే:
ఎమ్మెల్సీ దాసోజు
42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలను మోసగించడమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కను ప్రశ్నించారు. ‘కులగణన జరిపించి, మేమెంతో మాకంత రిజర్వేషన్ ఇస్తామని నమ్మబలికి, మా ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అమలుచేయకుండా స్థానిక ఎన్నికల ప్రస్తావన తేవడం.. దగా, మోసం, నయవంచన. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే, రాజకీయ మూల్యం చెల్లించుకుంటారు. తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు.
గడువు ముగిసిన పాలక మండళ్లుగ్రామ పంచాయతీలు