హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఎన్నికల సంఘానికి చెందిన రాష్ట్ర అధికారులు ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిపేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని ఏవిధంగా వినియోగించుక్నునారనే దానిపై అధ్యయనం చేస్తారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ (ఎస్వీఈఈపీ) పై పరిశీలన చేయనున్నారు. ఐటీ యాప్ల వినియోగం, ఓటర్లకు, రాజకీయ పార్టీలకు సులువైన, అనువైన విధానాల పరిశీలించి వాటిని తెలంగాణలో అమలుచేస్తారు.
ఆర్డీవోలు, తహసీల్దార్లకు శిక్షణ
సార్వత్రిక ఎన్నికలు ఏర్పాట్లలో భాగంగా ఆర్డీవోలు, తహసీల్దార్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే జిల్లా ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వగా, తాజాగా రిటర్నింగ్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నారు. బీఆర్కేఆర్ భవన్లో శిక్షణలు కొనసాగుతున్నాయి.