హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి కాంగ్రె స్ టికెట్ ఆశిస్తున్న నవీన్‌యాదవ్‌పై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రా త్రి కేసు నమోదైంది. ఓటర్ కార్డుల పంపిణీపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకున్నది.
యూసుఫ్‌గూడ సర్కిల్ డి ప్యూటీ మున్సిపల్ కమిషనర్, ఈఆర్వో రజనీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు. ఓటర్ కార్డుల పంపిణీ ఆరోపణల నేపథ్యంలో యూసుఫ్‌గూడకు చెందిన పలువురిని స్టేషన్‌కు రప్పించి పోలీసులు విచారిస్తున్నారు. ఆ ఓటర్ కార్డుల గురించి పోలీసులు ఆరా తీశారు. ఎవరెవరికి ఓటరు కార్డులను పంచిపెట్టారు. అందులో బోగస్ కార్డులు ఉన్నా యా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కాంగ్రెస్ నేత నవీన్‌యాదవ్ ఓటుహక్కును రద్దుచేయాలి. ఎన్నికల్లో పోటీకి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలి’ అని రెడ్ కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ఎన్నికల కమిషన్‌ను కోరారు. నవీన్‌యాదవ్‌పై చర్య తీసుకోకుంటే మున్ముందు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘిస్తారోనని అనుమానం వ్యక్తంచేశారు.
ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పని చేస్తున్నట్టయితే వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి తొత్తుగా మారిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న నవీన్‌యాదవ్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటర్ కార్డులను పంపిణీ చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించింది కేవలం ఎన్నికల కోడ్ మాత్రమే కాదని, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్టేనని విమర్శించారు.